మమతా బెనర్జీకి షాక్.. చైర్‌పర్సన్‌గా తొలగించిన రెబల్ వర్గం

Mamata Banerjee shocked as rebel faction removes her as TMC chairperson
  • టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
  • చైర్‌పర్సన్ పదవి నుంచి మమతను తొలగించిన రెబల్స్
  • కొత్త కమిటీ ఏర్పాటు, అరూప్ రాయ్ నూతన చైర్మన్
  • అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేసిన తిరుగుబాటు వర్గం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో సంక్షోభం పతాక స్థాయికి చేరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష నేత, టీఎంసీ రెబల్ నాయకుడు రితబ్రత బెనర్జీ ప్రకటించారు. అసలైన టీఎంసీ తమదేనని ఆయన స్పష్టం చేశారు.

కోల్‌కతాలోని న్యూటౌన్‌లో గల ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో సోమవారం ఈ వర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను కొత్త చైర్‌పర్సన్‌గా వాయిస్ ఓటు ద్వారా ఎన్నుకున్నారు. పార్టీ నిర్వహణ కోసం 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించారు. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్‌తో పాటు అరూప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబినా యాస్మిన్‌లను వైస్ చైర్‌పర్సన్‌లుగా నియమించారు.

రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు. తమకు 60 మంది ఎమ్మెల్యేలు, 70 మంది మాజీ కౌన్సిలర్ల మద్దతు ఉందని వారు వెల్లడించారు. ఇదే క్రమంలో మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కూడా ఈ వర్గం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Go Back to Shorts
Mamata Banerjee
Trinamool Congress
West Bengal politics
Ritabrata Banerjee
Arup Roy
Abhishek Banerjee

More Telugu News