45 ఏళ్ల పాటు నడిచిన రెస్టారెంట్ మూసివేత.. బోర్డుపై సీక్రెట్ రెసిపీ రాసి వెళ్లిన యాజమాన్యం!
- వీడ్కోలు బోర్డుపై తమ ఫేమస్ వైట్ సాస్ రెసిపీని రాసిన యాజమాన్యం
- 2017లో మూసివేసినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ
- వ్యాపార రహస్యం కంటే కస్టమర్ల ప్రేమకే విలువిచ్చిన ఘటనపై ప్రశంసలు
వివరాల్లోకి వెళ్తే, 'గైరో II' (Gyro II) అనే ఓ రెస్టారెంట్ సుమారు 45 ఏళ్ల పాటు ఆహార ప్రియులను అలరించింది. 2017 సెప్టెంబర్ 11న ఈ రెస్టారెంట్‌ను శాశ్వతంగా మూసివేశారు. అయితే, వీడ్కోలు చెబుతూ వారు చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది. రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపే బోర్డుపై, తమ రెస్టారెంట్లో ఎంతో ఫేమస్ అయిన 'వైట్ సాస్' తయారీ రహస్యాన్ని రాసి వెళ్లారు.
వ్యాపార రహస్యంగా కాపాడుకోవాల్సిన రెసిపీని ఇలా బహిరంగంగా పంచుకోవడం వారి గొప్ప మనసుకు నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆ సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని స్పష్టంగా వివరించారు.
వైట్ సాస్ రెసిపీ:
మయోన్నైస్ (Mayonnaise): 32 ఔన్సులు, వెనిగర్ (Vinegar): 8 ఔన్సులు, పంచదార (Sugar): 4 ఔన్సులు, దిల్ వీడ్ (Dill weed): 1 ఔన్సు
ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి, ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి. ఈ క్రీమీ సాస్‌ను గైరోస్, శాండ్విచ్లు, బర్గర్లతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, గ్రిల్డ్ వెజిటబుల్స్‌కు డిప్‌గా కూడా ఉపయోగించవచ్చు.
2017 నాటి ఈ సంఘటన, ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవ్వడంతో వార్తల్లో నిలిచింది. వ్యాపార రహస్యాల కన్నా కస్టమర్లతో ఉన్న అనుబంధానికి, వారి జ్ఞాపకాలకు విలువ ఇవ్వాలని ఈ రెస్టారెంట్ నిరూపించిందని నెటిజన్లు కొనియాడుతున్నారు.