నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి!

Leopard carries away four year old girl father fights to save her life
  • మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి
  • ప్రాణాలకు తెగించి కూతురిని కాపాడుకున్న తండ్రి
  • చీకట్లో పారిపోతూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డ తండ్రీకూతుళ్లు
  • గ్రామస్థుల సహాయంతో సురక్షితంగా బయటకు.. ఆసుపత్రిలో చికిత్స
ఫాదర్స్ డే వేళ, ఓ తండ్రి తన కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ సాహసం చేశాడు. నాలుగేళ్ల చిన్నారిని నోట కరుచుకుని వెళుతున్న చిరుతపులితో ప్రాణాలకు తెగించి పోరాడి, బిడ్డను సురక్షితంగా విడిపించుకున్నాడు. ఆ తర్వాత చీకట్లో ప్రమాదవశాత్తు ఓ బావిలో పడిపోయినప్పటికీ, కుమార్తె నీటిలో మునిగిపోకుండా తన తలపై ఉంచుకుని రక్షించుకున్నాడు. మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో మొన్న రాత్రి జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. తీవ్రంగా గాయపడిన తండ్రీకూతుళ్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అకోలే తాలూకాలోని డోంగర్‌గావ్ గ్రామానికి చెందిన మనోజ్ గుంజాలే (32) వృత్తిరీత్యా రైతు. జూన్ 20న రాత్రి ఎనిమిది గంటల సమయంలో అతని భార్య దీపాలి, నాలుగేళ్ల కుమార్తె అవనిని వీపుపై కూర్చోబెట్టుకుని జొన్న చేను నుంచి ఇంటికి వస్తుండగా, అకస్మాత్తుగా ఓ చిరుతపులి దాడి చేసింది. చిన్నారిని నోట కరుచుకుని చిరుత అడవిలోకి తీసుకెళుతుండగా, దీపాలి పెట్టిన కేకలు విన్న మనోజ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు.

చిరుతతో భీకరంగా పోరాడి తన కుమార్తెను ప్రాణాలతో విడిపించుకున్నాడు. తీవ్ర ఆందోళనలో బిడ్డను ఎత్తుకుని చీకట్లో ఇంటికి పరుగులు తీస్తుండగా, పొలంలోని ఒక పాడుబడిన బావిలో తండ్రీకూతుళ్లు ఇద్దరూ ప్రమాదవశాత్తు పడిపోయారు. అప్పటికీ ధైర్యం కోల్పోని మనోజ్, చిన్నారి నీటిలో మునగకుండా తన తలపై నిలబెట్టి కాపాడాడు. వారి కేకలు విన్న గ్రామస్తులు టార్చ్ లైట్లతో అక్కడకి చేరుకుని, తండ్రీకూతుళ్లిద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు.

వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగమ్‌నేర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే కోలుకుంటున్నారు. "ఈరోజు నా బిడ్డకు ఎదురైన పరిస్థితి రేపు మరొకరికి రాకూడదు. అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించి చిరుతల భయం నుంచి మాకు విముక్తి కల్పించాలి" అని మనోజ్ భార్య దీపాలి విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Manoj Gunjale
Leopard attack Maharashtra
Father saves daughter from leopard
Ahilyanagar leopard news

More Telugu News