భారతీయుడికి అరుదైన గౌరవం.. వాట్సాప్ సీఈవోగా కునాల్ షా

Kunal Shah appointed as WhatsApp CEO in rare honor for an Indian
  • వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా క్రెడ్ ఫౌండర్
  • కునాల్ షాకు చెందిన క్రెడ్ సంస్థలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన మెటా
  • ప్రస్తుత హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న కునాల్ షా
  • ఈ డీల్‌తో క్రెడ్ కంపెనీ విలువ 4.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా
  • క్రెడ్ సీఈఓ పదవికి కునాల్ షా రాజీనామా, తాత్కాలిక సీఈఓ నియామకం
టెక్ ప్రపంచంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ నూతన గ్లోబల్ హెడ్‌గా, సీఈఓగా భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ (క్రెడ్) వ్యవస్థాపకుడు కునాల్ షాను నియమిస్తున్నట్లు 'మెటా' ప్రకటించింది. అదే సమయంలో క్రెడ్ సంస్థలో సుమారు 900 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,550 కోట్లు) మేర భారీ పెట్టుబడి పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది.

ఈ ఒప్పందంతో క్రెడ్ కంపెనీలో మెటాకు సుమారు 20 శాతం మైనారిటీ వాటా లభించనుంది. దీనితో సంస్థ విలువ 4.5 బిలియన్ డాలర్లకు (రూ. 43,239 కోట్లు) చేరినట్లు అంచనా. ఈ తాజా నియామకంతో కునాల్ షా క్రెడ్ సీఈఓ పదవి నుంచి వైదొలగి, మెటా గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరనున్నారు. గడిచిన ఏడేళ్లుగా వాట్సాప్‌కు నేతృత్వం వహిస్తున్న విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా, క్యాత్‌కార్ట్ ఇకపై మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

భారతీయ మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన కన్జ్యూమర్ ఉత్పత్తులను రూపొందించడంలో కునాల్ షాకు ఉన్న అనుభవం, డిజిటల్ చెల్లింపుల రంగంలో ఆయన నైపుణ్యం తమకు ఎంతగానో దోహదపడతాయని మెటా ఒక ప్రకటనలో పేర్కొంది. క్లిష్టమైన వ్యాపార వాతావరణంలోనూ వృద్ధిని సాధించగల కునాల్ షాలోని వ్యవస్థాపక సామర్థ్యాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

2018లో ప్రారంభమైన క్రెడ్, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందిస్తూ స్వల్ప కాలంలోనే విశేష గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సంస్థ చెల్లింపులు, రుణాలు, బీమా వంటి విభిన్న ఆర్థిక సేవలను అందిస్తోంది. క్రెడ్‌కు ప్రస్తుతం నెలకు 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. తాజా మార్పుల నేపథ్యంలో కునాల్ షా స్థానంలో క్రెడ్ తాత్కాలిక సీఈఓగా మితిన్ సంపత్ బాధ్యతలు చేపట్టారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వేదికగా వాణిజ్య కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది.
Go Back to Shorts
Kunal Shah
WhatsApp CEO Kunal Shah
Meta investment CRED
WhatsApp Global Head
Indian fintech leader

More Telugu News