ఢిల్లీలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ నిజమేనా? అంటూ ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న... సూటిగా బదులిచ్చిన లోకేశ్

Nara Lokesh responds to Arnab Goswami on special treatment in Delhi
  • ఢిల్లీలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపుపై స్పందించిన నారా లోకేశ్
  • ఎక్కువ ఎంపీలుంటే మాట గట్టిగా వినిపించడానికి వీలవుతుందన్న ఏపీ మంత్రి
  • అమరావతి పూర్తిగా స్వీయ-నిధులతో నిర్మించే ప్రాజెక్ట్ అని వెల్లడి
  • సీఎం చంద్రబాబు ఐటీ, ఏఐ, క్వాంటం అన్నీ ఆయనేనని చమత్కారం
  • రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పాలనలో పారదర్శకత తెస్తున్నామన్న లోకేశ్
కేంద్రంలో ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో, ఢిల్లీలో ఆ పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోందన్న ప్రచారంపై ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్‌లో ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అడిగిన సూటి ప్రశ్నకు ఆయన అంతే సూటిగా, వివరణాత్మకంగా సమాధానమిచ్చారు. "ఎన్డీయేలో మీరే అతిపెద్ద మిత్రపక్షం కాబట్టి, మీకు ఢిల్లీలో స్పెషల్ ట్రీట్‌మెంట్ లభిస్తోందన్న ప్రచారం నిజమేనా?" అని ఆర్నాబ్ ప్రశ్నించారు.

దీనిపై లోకేశ్ బదులిస్తూ, "ఆర్నాబ్ జీ, ఎక్కువ మంది ఎంపీలు ఉండటం వల్ల మన మాట గట్టిగా వినిపించడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల రాష్ట్రానికి, నాకు వ్యక్తిగతంగా ఏం లాభం కలిగింది? ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి డిన్నర్ చేసే అవకాశం దొరికింది. ఆయన ఎంతో ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు. ఆయన దార్శనికత ఏంటో నాకు అర్థమైంది. కేంద్రం అద్భుతమైన పాలసీలు తీసుకొస్తుంటే, వాటిని అమలు చేయాల్సింది రాష్ట్రాలే. ఆ విషయంలో ఏపీ వేగంగా ముందుకెళుతోంది, అందుకే మాకు గుర్తింపు వస్తోంది" అని తెలిపారు.

స్పీడే మా బలం

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వేగాన్ని వివరిస్తూ, "ఇతర రాష్ట్రాలు ఆలోచిస్తున్నప్పుడు, నేను రక్షణ మంత్రి వద్దకు వెళ్లి 'మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి, భూమి సిద్ధంగా ఉంది' అని అడిగితే ఆయన ఎందుకు కాదంటారు? కేవలం 37 రోజుల్లో 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇచ్చింది. ఇదే మా స్పీడ్. వేగంగా పనిచేసే రాష్ట్రాల వైపే ప్రధాని కూడా చూస్తున్నారు. రాష్ట్రాలు పోటీ పడితేనే దేశం గెలుస్తుందని నా నమ్మకం" అని లోకేశ్ అన్నారు.

చంద్రబాబే ఐటీ, ఆయనే ఏఐ

చంద్రబాబు ఐటీకి బ్రాండ్ అయితే, మీరు ఏఐకి బ్రాండ్‌గా మారుతున్నారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు లోకేశ్ చమత్కరిస్తూ, "మా ముఖ్యమంత్రి గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది, ఆయన మాకు ఎలాంటి క్రెడిట్ వదిలిపెట్టరు. ఐటీ ఆయనే, ఏఐ ఆయనే, క్వాంటం కూడా ఆయనే. ఆయన చూపిన మార్గంలో పనులు పూర్తి చేయడమే నా కర్తవ్యం. చంద్రబాబు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వల్లే గూగుల్ వంటి సంస్థల తలుపులు మాకు తెరుచుకున్నాయి. ఏడాదిలోపు డేటా సెంటర్‌ను దేశానికి అంకితం చేస్తాం" అని తెలిపారు. 'చంద్రబాబు నాయుడు 4.0' పాలన మునుపటి మూడు టర్మ్‌ల కంటే భిన్నంగా ఉంటుందని, 2024 బృందం అత్యద్భుతంగా పనిచేసిందని సీఎం చేత అనిపించుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

అభివృద్ధి, వనరుల సమతుల్యత

డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ వల్ల స్థానిక అవసరాలకు ఇబ్బంది కలుగుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ, "ప్రతి ఏటా గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది. డేటా సెంటర్లకు కావాల్సింది కేవలం 1.5 టీఎంసీలు మాత్రమే. పోలవరం పూర్తయ్యాక ఈ నీటిని వాడుకుంటాం. ఇక విద్యుత్ విషయానికొస్తే, రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ పుష్కలంగా ఉంది. 'వన్ గ్రిడ్' విధానం ద్వారా సరఫరా చేస్తాం" అని వివరించారు.

రియల్-టైమ్ గవర్నెన్స్

రియల్-టైమ్ గవర్నెన్స్ అనేది మార్కెటింగ్ పదం కాదని, దాని ద్వారానే పాలనలో పారదర్శకత సాధ్యమని లోకేశ్ అన్నారు. "గత ఐదేళ్లలో పర్యవేక్షణ లోపించి రాష్ట్రంలో అక్షరాస్యత పడిపోయింది. కానీ ఇప్పుడు రియల్-టైమ్ డేటా ద్వారా ఏ పాఠశాలలో ఏ విద్యార్థి వెనుకబడ్డాడో అమరావతిలో కూర్చొని నేను తెలుసుకోగలను. ఈ పర్యవేక్షణ వల్లే ఈ ఏడాది 85,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు" అని ఉదహరించారు.

రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని ఆర్నాబ్ అడగ్గా, లోకేశ్ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. "2004లో ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన ఏడాది తర్వాత, మా నాన్నగారితో ఒక పెళ్లికి వెళ్లాను. అక్కడ ఉన్న 5,000 మంది ఆయన రాగానే లేచి నిలబడి గౌరవం ఇచ్చారు. పదవిలో లేకపోయినా ప్రజలు ఇచ్చే ఆ గౌరవాన్ని చూశాక, రాజకీయాల్లోనే అంతటి గౌరవం దక్కుతుందని అర్థమైంది. అదే నన్ను రాజకీయాల వైపు నడిపించింది" అని లోకేశ్ తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న స్ఫూర్తిని వివరించారు. ఈ సంభాషణ ముగింపులో ఆర్నాబ్ గోస్వామి, లోకేశ్‌ను దేశం గమనిస్తున్న యువ నాయకుడిగా ప్రశంసించారు.
Go Back to Shorts
Nara Lokesh
Arnab Goswami
Republic TV Conclave
TDP NDA Alliance
Amaravati Development
Andhra Pradesh Politics

More Telugu News