మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్
- ఢిల్లీలో మీడియా కాంక్లేవ్
- వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు 'S'ల వల్లే ఏపీకి పెట్టుబడులన్న లోకేశ్
- 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
- వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి
- 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
ఆర్నబ్ గోస్వామి ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలు
ఈ చర్చను ఆర్నబ్ గోస్వామి తన పాత జ్ఞాపకాలతో ప్రారంభించారు. "మీ తండ్రి చంద్రబాబు గారు 90వ దశకం చివర్లో కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పట్లో మాతో చాలా చనువుగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మీలో మీ నాన్నగారి పోలికలు, అదే ఆకర్షణ కనిపిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ప్రజలు మరింత దగ్గరగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ లోకేశ్ ను సంభాషణలోకి ఆహ్వానించారు.
మీ రాజకీయ ప్రయాణం, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?
ఆర్నబ్ అడిగిన ఈ ప్రశ్నకు లోకేశ్ బదులిస్తూ, "ఇదొక అద్భుతమైన ప్రయాణం. రాజకీయమనేది గమ్యం కాదు, ఒక నిరంతర ప్రయాణం. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకు ఇంకా 40-50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉంది. గత పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు, పరాజయాలను సమానంగా స్వీకరించాను. ప్రస్తుతం యువ నాయకులు బాధ్యతలు స్వీకరించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన సమయం ఇది. నేను అదే బాటలో పయనిస్తున్నాను" అని తెలిపారు.
ముఖ్యమంత్రి మీకు ఇచ్చిన లక్ష్యం ఏంటి?
"2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన విజన్. ఆయనకు పనులు ఎప్పుడూ వేగంగా జరిగిపోవాలి. అలాంటి బాస్ ఉన్నప్పుడు ఆయన వేగాన్ని అందుకోవడం కష్టమే అయినా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి నేను చైర్మన్‌గా ఉన్నాను. ఉద్యోగాల సృష్టే నా ఏకైక లక్ష్యం. ఇదే నన్ను రేయింబవళ్లు పనిచేసేలా చేస్తోంది" అని లోకేశ్ వివరించారు.
పెట్టుబడులకు ఏపీ ఎందుకు ప్రత్యేకం?
"మేం మూడు 'S'ల ఫార్ములాను నమ్ముకున్నాం. అవే వేగం, స్థిరత్వం, సేవ. మా వేగానికి నిదర్శనమే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ అయిన గూగుల్ డేటా సెంటర్ కేవలం 13 నెలల్లో, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 17 నెలల్లో పనులు ప్రారంభించడం. స్వదేశీ ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్టు ఏఎంసీఏకు 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చాం. రెండోది స్థిరత్వం. మా నాయకుడికి అభివృద్ధిపై స్పష్టమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మూడోది సేవ. వ్యాపారవేత్తలను నేను దేశ నిర్మాతలుగా చూస్తాను. వారికి సేవ చేయడం నా బాధ్యత. ఈ మూడు 'S'ల వల్లే దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయి" అని లోకేశ్ అన్నారు.
అమరావతి పురోగతి, నిధులపై స్పష్టత
ఢిల్లీలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందా, అమరావతికి కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయా అన్న ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ, "ఎక్కువ ఎంపీలు ఉండటం వల్ల మా గొంతు గట్టిగా వినిపించడానికి అవకాశం దొరికింది. కానీ, రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉంటేనే దేశం గెలుస్తుంది. మా పనితీరు వేగంగా ఉండటం వల్లే కేంద్రం నుంచి ప్రాజెక్టులు సాధించగలుగుతున్నాం. ఇక అమరావతి అనేది ఒక సెల్ఫ్-ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. 2028 నాటికి అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి ప్రభుత్వ భవనాలను పూర్తి చేస్తామని ప్రధానికి మాట ఇచ్చాం. దాని కోసం దాదాపు 60 వేల కోట్ల రూపాయల నిధులు సమీకరించబోతున్నాం. దేశం గర్వపడేలా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నాం. అయితే రాజధాని అమరావతే అయినా, విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతి ప్రాంతాన్ని తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం" అని స్పష్టం చేశారు.
టీడీపీలో యువ నాయకత్వంపై..
టీడీపీలో యువతకు ఇస్తున్న ప్రాధాన్యంపై అడిగిన ప్రశ్నకు, "మా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ ఎన్నికల్లో గెలిచిన మా ఎమ్మెల్యేల్లో 50% మంది, మంత్రుల్లో 17 మంది తొలిసారి గెలిచినవారే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటరీ బృందం మాది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే ఇందుకు నిదర్శనం. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం" అని లోకేశ్ బదులిచ్చారు.