ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి... జాగ్రత్తగా ఉండాలి: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

  • కొన్ని పార్టీలు ప్రతి అంశానికి కుల, మత రంగు పులుముతున్నాయని ఆరోపణ
  • ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన
  • ఉద్యోగులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం
  • రాష్ట్రంలో క్వాంటం ఆర్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపు
రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి సంఘటనకు కుల, మత రంగు పులిమి, వివాదాస్పదం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న తప్పుడు ప్రచారాలను, ఘటనలను అరికట్టేందుకు అధికారులు, ఉద్యోగులు చొరవ చూపాలన్నారు. ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు మానసిక సమస్యలు, మరికొన్నింటికి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యసనం కారణమని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం పాత కేసులను సైతం పరిష్కరిస్తోందని, 2019లో జరిగిన నేరాలను ఇప్పుడు గుర్తించి నిందితులను పట్టుకుని శిక్షలు పడేలా చేస్తున్నామని తెలిపారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరనే వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే నంబర్ ప్లేట్లు ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సాంకేతికత కీలకమని, ఈ నేపథ్యంలో క్వాంటం ఆర్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. పచ్చదనం పెంపు, పరిశుభ్రత, జల భద్రత, భూగర్భ జలాల రీఛార్జ్, నదుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కింద వచ్చే అర్జీలను సానుభూతితో పరిశీలించాలన్నారు. "సమస్య పరిష్కారం కోసం తమ దగ్గరకు వచ్చే పౌరులతో అధికారులు, ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలి. వారి స్థానంలో మనమే ఉంటే ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి సేవలు అందించాలి. ఇది పరిపాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది" అని ఆయన హితవు పలికారు. 

ఉద్యోగుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తామని, పనితీరు ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తామని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఫైళ్ల క్లియరెన్స్ సులభమైందని, అయితే వినూత్న ఆలోచనలు లేకపోతే వ్యవస్థలు నిస్సారంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Chandrababu Naidu
Andhra Pradesh Government
AP Officials Review Meeting
Quantum Computer Andhra Pradesh
Public Grievance Redressal System
RTGS Center Review

More Telugu News