డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!

  • తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను ఢీకొన్న టిప్పర్
  • అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వెంకన్న
  • అక్రమాలను అడ్డుకుంటే లారీలతో తక్కించి చంపేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.


డీటీఓ వెంకన్న మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదనే బలమైన సందేహాన్ని హరీశ్‌రావు లేవనెత్తారు. "రాష్ట్రంలో అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాల ఆటలు మితిమీరిపోయాయి. నిజాయతీగా పనిచేసే అధికారులు వారి అక్రమాలకు అడ్డొస్తే... ఇలా లారీలతో తొక్కించి ప్రాణాలు తీస్తారా?" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


భూపాలపల్లి ఏరియాలో సాగుతున్న అక్రమ ఇసుక, బొగ్గు రవాణా వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? వారికి సహకరిస్తున్న లీడర్స్ ఎవరు? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని పూర్తిగా వెలికితీయాల్సిన బాధ్యత ముమ్మాటికీ రాష్ట్ర సర్కార్ పైనే ఉందన్నారు. కేవలం డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదని... ఈ కేసుపై ఒక ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించి, దీని వెనుక ఎవరి ప్రేరేపణ అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలన్నారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటు, భవిష్యత్తులో విధుల్లో ఉండే అధికారులకు ఇలాంటి దారుణాలు జరగకుండా పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.


Harish Rao
DTO Venkanna
Jayashankar Bhupalpally
Coal Mafia
Telangana Road Accident
BRS Party

More Telugu News