క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

  • క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్
  • వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక
  • శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ
  • తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన
  • నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, నేరస్తులకు కులం, మతం, ప్రాంతం వంటివి అంటగట్టి వెనకేసుకొచ్చే సంస్కృతికి చరమగీతం పాడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడింది తన పార్టీ నాయకులైనా సరే ఉపేక్షించేది లేదని, పోలీసుల విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోనని హామీ ఇచ్చారు. కాకినాడలో జరిగిన 'మన ఊరు - మాట మంతి' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, క్రిమినల్స్‌ను ప్రోత్సహించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన రౌడీ మూకలను, గుండాలను తొక్కి నార తీస్తాను అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.

వైసీపీ గుండాలకు బహిరంగ హెచ్చరిక
"రక్తపాతం సృష్టిస్తాం, కుత్తుకలు కోస్తాం అని విర్రవీగుతున్న ప్రతి వైసీపీ గుండాకు కెమెరా సాక్షిగా చెబుతున్నా. మీ పిచ్చి వేషాలు మా దగ్గర చెల్లవు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రజల చేతిలో నిర్ణయం ఉంటుంది. ఒకవేళ మీ ప్రభుత్వమే వచ్చినా సరే, మిమ్మల్ని తొక్కి నార తీస్తాను, గుర్తుపెట్టుకోండి. గతంలో వైసపీకి పనిచేశామని ఇప్పటికీ విధేయత చూపిస్తున్న కొందరు అధికారులపై ప్రత్యేక దృష్టి పెడతాను" అని పవన్ తీవ్రంగా హెచ్చరించారు.

"దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. పదవుల కోసం కాదు. కాకినాడలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎవరు ఎస్పీగా, కలెక్టర్‌గా ఉండాలో నేను నిర్దేశించలేదు. వ్యవస్థలను బలోపేతం చేయండి, నా నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాదని వారికి చెప్పాను. నా పార్టీ వాళ్లను పట్టుకున్నా వదలమని చెప్పను. ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపేస్తే జైలుకు వెళ్లి అభినందించే వ్యక్తిని నేను కాదు. తెలిసి తెలియని వయసులో 23 నేరాలు చేసిన వాడ్ని కూడా పసిపిల్లవాడని వెనకేసుకొచ్చే నాయకుడిని కాదు" అని పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేరపూరిత భావజాలాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తు ఊహకు అందకుండా తయారవుతుందని ప్రజలను హెచ్చరించారు.

శాంతిభద్రతల పునరుద్ధరణే లక్ష్యం
శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని, సమాజం సవ్యంగా ముందుకు సాగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. "లా అండ్ ఆర్డర్ అనేది కేవలం ప్రభుత్వ విధి మాత్రమే కాదు, నాగరిక సమాజానికి అది పునాది. అది లేకపోతే సంక్షేమం, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కుప్పకూలిపోతాయి. రూల్ ఆఫ్ లాను బలంగా నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులదే. ఏ విషయంలోనైనా ఒత్తిడి తీసుకువచ్చేలా నా నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాదు" అని ఎస్పీ, కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు.

క్రిమినల్స్‌కు కులం రంగు పులమొద్దు
కొందరు నేరస్తులకు కులం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన కులం దరిద్రం వదిలితే తప్ప రాష్ట్రం బాగుపడదు. క్రిమినల్‌కు కులం ఉండదు. అత్యాచారం చేసేవాడికి, దోపిడీ చేసే నీచుడికి కులం ఎందుకు ఉంటుంది? అలాంటి వారిని వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి నైజాన్ని తెలుపుతుంది. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్‌ను హత్య చేస్తే, అది కాపులందరికీ చెడ్డపేరు అవుతుందా? ప్రతిదానికీ కులాన్ని లాగడం సరికాదు" అని ఆయన ప్రశ్నించారు. సుగాలి ప్రీతి, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో గత ప్రభుత్వం సాక్ష్యాలను నాశనం చేయడం వల్లే నేరస్తులకు శిక్ష పడటం కష్టమవుతోందని అన్నారు.

తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులపై కఠినంగా ఉండాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని పవన్ విమర్శించారు. "నిజమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎంత బలంగా ఎదుర్కొంటామో, తప్పుడు కేసులను కూడా అంతే బలంగా నిలువరించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం ఉన్నవారెవరూ తప్పుడు కేసులు పెట్టరు. సుప్రీంకోర్టు కూడా దీనిపై స్పందించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మా కూటమి నాయకులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు" అని విజ్ఞప్తి చేశారు.

పౌర సమాజం మేల్కొనాలి
ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించాలని, తమ ప్రాంతాల్లో జరిగే అన్యాయాలపై గొంతెత్తాలని పవన్ పిలుపునిచ్చారు. "కుల సంఘాలకు వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పుడు, శాంతిభద్రతల కోసం ఎందుకు లేవు? మీ వీధిలో 30-40 మంది కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడండి. సిటిజన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకోండి. మీరు బలంగా నిలబడితే, ఏ క్రిమినల్ కూడా తలెత్తడానికి భయపడతాడు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలపై ఎక్కడికక్కడ గొంతెత్తాలి. నన్ను కులానికి పరిమితం చేయొద్దు" అని చేతులెత్తి నమస్కరిస్తూ కోరారు. వ్యవస్థాగత వైఫల్యం వల్లే ఒక ఎస్సై పరిష్కరించాల్సిన సమస్య డిప్యూటీ సీఎం వద్దకు వస్తోందని, ఇలాంటి పరిస్థితులను మార్చడానికే తాను కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.

Pawan Kalyan
YSRCP
Andhra Pradesh Law and Order
Kakinada
Jana Sena Party
Mana Ooru Mata Manti

More Telugu News