మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Tamil Nadu Assembly passes unanimous resolution against Mekedatu Dam
  • మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం
  • ఈ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమన్న సీఎం విజయ్
  • ఇటీవల మోదీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయ్

కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వివాదం.. 'మేకెదాటు డ్యామ్' ప్రతిపాదనతో మరోసారి తీవ్రరూపం దాల్చింది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకెదాటు వద్ద కొత్త డ్యామ్ నిర్మాణానికి జరుపుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ఉదయం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అధికార పక్షంతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఇతర రాజకీయ పక్షాలు పూర్తి మద్దతు ప్రకటించడంతో అసెంబ్లీ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించింది.


అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా విజయ్ మాట్లాడుతూ... కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కావేరి నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన తుది అవార్డుతో పాటు, ఈ విషయమై గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం గనుక చేపడితే దిగువన ఉన్న తమిళనాడులోని కావేరి డెల్టా పరివాహక ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, వారి జీవనాధారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పర్యావరణ, సాంకేతిక అనుమతులు మంజూరు చేయకూడదని తీర్మానం ద్వారా డిమాండ్ చేశారు.


ఈ అసెంబ్లీ తీర్మానానికి ముందే, గత నెలలో విజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ ఆయనకు ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. కావేరి నదీ జలాల నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్న ఇతర బేసిన్ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) రాతపూర్వక అనుమతి, ఆమోదం లేకుండా కర్ణాటక ఏకపక్షంగా మేకెదాటు ప్రాజెక్టును చేపట్టడానికి వీల్లేదని విజయ్ ప్రధానికి వివరించారు. ఈ విషయమై కర్ణాటకకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర నీటి వనరుల శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన ప్రధాని మోదీని అభ్యర్థించారు. తమిళనాడు సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్లింది.

Go Back to Shorts
Tamil Nadu Assembly
Mekedatu Dam
Cauvery River
Chief Minister Vijay
Karnataka
Narendra Modi

More Telugu News