రూ.57,990కే 144Hz టీవీ.. మార్కెట్లోకి హైసెన్స్ కొత్త సిరీస్
- ప్రారంభ ధర రూ.57,990
- 55 నుంచి 85 అంగుళాల మోడళ్లు
- 144Hz రిఫ్రెష్ రేట్ ప్రత్యేకత
- డాల్బీ విజన్ IQ మద్దతు
- డెవియాలెట్ ట్యూన్ చేసిన సబ్‌వూఫర్
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు
ఈ సిరీస్‌లో 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు, 85 అంగుళాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ ధర రూ.57,990గా నిర్ణయించింది. అయితే ఇవి పరిమిత కాల ఆఫర్ ధరలేనని కంపెనీ తెలిపింది.
కొత్త టీవీల్లో ప్రధాన ఆకర్షణ 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్. సాధారణ టీవీలతో పోలిస్తే వేగంగా కదిలే దృశ్యాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా గేమింగ్, స్పోర్ట్స్ కంటెంట్ చూసేవారికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ సిరీస్‌లో ULED మినీ-ఎల్ఈడీ డిస్ప్లేను అందించింది. ఫుల్ ఆరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉండటంతో చీకటి సన్నివేశాల్లో నలుపు రంగు మరింత స్పష్టంగా కనిపిస్తుందని, ప్రకాశవంతమైన దృశ్యాల్లోనూ బొమ్మలు బాగా కనిపిస్తాయని కంపెనీ తెలిపింది.
పిక్చర్ క్వాలిటీ కోసం HDR10+ అడాప్టివ్, డాల్బీ విజన్ IQ, ఫిల్మ్‌మేకర్ మోడ్ వంటి ఫీచర్లను అందించింది. రంగులు సహజంగా కనిపించేలా పాంటోన్ ధ్రువీకరణ పొందిన Hi-QLED కలర్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ టీవీలు VIDAA స్మార్ట్ ఓఎస్‌పై పనిచేస్తాయి. ప్రముఖ ఓటీటీ యాప్‌లకు మద్దతు ఉంటుంది. రిమోట్ లేకుండా వాయిస్ కమాండ్లతో కూడా నియంత్రించవచ్చు.
పిక్చర్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు కంపెనీ హై-వ్యూ ఏఐ ఇంజిన్‌ను అందించింది. గదిలో వెలుతురు పరిస్థితులను బట్టి స్క్రీన్ బ్రైట్నెస్, కలర్స్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకునే ఏఐ ఆర్జీబీ లైట్ సెన్సర్ కూడా ఉంది. 85 అంగుళాల మోడల్లో మరింత శక్తిమంతమైన ‘హై-వ్యూ ఏఐ ఇంజిన్ ప్రో’ను ఇచ్చింది.
ఆడియో విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన డెవియాలెట్ ట్యూన్ చేసిన బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్‌ను ఇందులో అమర్చింది. అదనపు స్పీకర్లు లేకుండానే గట్టిగా, లోతైన బాస్‌తో కూడిన సౌండ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ టీవీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా విక్రయించనుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.