అమెరికానే ఒప్పందం కోసం ఆత్రుత చూపింది: ఖమేనీ

  • అమెరికాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • నిరాశతో ట్రంప్‌ అనేక ఒత్తిళ్లు తెచ్చినట్లు వెల్లడి
  • ఒప్పందంపై తనకు భిన్నాభిప్రాయం ఉందని వ్యాఖ్య
  • భవిష్యత్తులో అదనపు డిమాండ్లు తెస్తే అంగీకరించమని స్పష్టీకరణ
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం అమెరికానే ఎక్కువగా ప్రయత్నించిందని, అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ఒత్తిళ్లు, వివిధ రకాల దౌత్య ప్రయత్నాలు ఉపయోగించి ఒప్పందాన్ని సాధించారని పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలో ఖమేనీ ‘‘అమెరికా అధ్యక్షుడు నిరాశతో అన్ని రకాల ప్రభావాలను ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. ఇరాన్ అధికారులు నిజాయతీగా చర్చలు జరిపారు. అయితే ఈ ఒప్పందంపై నాకు సూత్రప్రాయంగా భిన్న అభిప్రాయం ఉంది’’ అని తెలిపారు. అయినప్పటికీ ఇరాన్ ప్రజల హక్కులు, దేశ ప్రయోజనాలు, ‘రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రయోజనాలు కాపాడతామన్న హామీతో ఒప్పందానికి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

భవిష్యత్తులో ఒప్పందానికి మించి అమెరికా అదనపు డిమాండ్లు చేయాలని ప్రయత్నిస్తే వాటిని ఇరాన్ అంగీకరించబోదని ఖమేనీ స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఓర్పుతో ఉండాలని, ఒప్పందంలో పేర్కొన్న షరతులు అమలవుతాయో లేదో గమనించాలని ఆయన సూచించారు.

ఈ ఒప్పందంపై సంతకాలు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఆతిథ్యంలో వెసాయ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక విందు సందర్భంగా జరిగాయి. జీ7 సదస్సు ముగిసిన అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. మేక్రాన్‌ ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని, అలాగే ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి సాయపడుతుందని పేర్కొన్నారు.

Mojtaba Khamenei
Donald Trump
Iran US Agreement
Emmanuel Macron
Versailles Palace
Strait of Hormuz

More Telugu News