ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా

Elon Musk becomes world first trillionaire Anand Mahindra shares success secret
  • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు
  • స్పేస్‌ఎక్స్ ఐపీఓతో 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద
  • మస్క్ పట్టుదలే అసలైన విజయమన్న ఆనంద్ మహీంద్రా
  • టెస్లా కష్టాల్లో ఉన్నప్పుడు మస్క్‌కు మద్దతిచ్చిన వైనం గుర్తు చేసుకున్న మహీంద్రా
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించి ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) విజయవంతం కావడంతో మస్క్ నికర సంపద ఒక ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఈ అద్భుత విజయంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, మస్క్ సాధించిన సంపద కంటే ఆయనలోని పట్టుదలే అసలైన విజయమని ప్రశంసించారు.

స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్లను సమీకరించింది. దీంతో ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం మస్క్ సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీలలో ఆయనకు ఉన్న భారీ వాటాలే ఈ అసాధారణ వృద్ధికి మూలధారమయ్యాయి.

ఈ చారిత్రక ఘట్టంపై భారత ప్రముఖ పారిశ్రామిక్కవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, "ప్రస్తుతం వార్తలన్నీ ట్రిలియన్ డాలర్ల గురించే ఉన్నాయి. అయితే, అసాధ్యమని భావించిన దానిని రేపటి వాస్తవంగా మార్చగలమనే ఆయన నమ్మకమే ఇక్కడి అసలైన కథ" అని పేర్కొన్నారు. 2018లో టెస్లా కంపెనీ ఉత్పత్తి పరంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ క్లిష్ట సమయంలో తాను సోషల్ మీడియా వేదికగా మస్క్‌కు అండగా నిలిచానని, సంక్షోభ సమయాల్లోనే నిజమైన ఆవిష్కర్తల సత్తా బయటపడుతుందని అప్పట్లోనే చెప్పానని వివరించారు. ఆనాడు మస్క్ ప్రదర్శించిన పట్టుదలే తనను ఎంతగానో ఆకట్టుకుందని మహీంద్రా వెల్లడించారు.

పునర్వినియోగ రాకెట్లు, స్టార్‌లింక్ ద్వారా ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్, అంగారకుడిపై మానవ ఆవాసాల వంటి మస్క్ కలలు ఒకప్పుడు అసాధ్యంగా కనిపించాయి. కానీ, ఆయన నిరంతర కృషితో అవి నేడు వాస్తవరూపం దాల్చుతున్నాయి. మస్క్ చూపిన ఈ అసాధారణ పట్టుదలే ఆయనను నేడు ఈ శిఖరాగ్రానికి చేర్చిందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Go Back to Shorts
Elon Musk
Anand Mahindra
SpaceX IPO
World First Trillionaire
Tesla
SpaceX Valuation

More Telugu News