గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రానికి అంధకారమే: మంత్రి అచ్చెన్నాయుడు
- గొడ్డలి పార్టీ బతికితే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్న అచ్చెన్నాయుడు
- డీఎస్సీపై చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరిన మంత్రి
- వెన్నుపోటు అనే పదానికి జగనే పేటెంట్ తీసుకున్నారని ఎద్దేవా
- ఇకపై జగన్ ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో తిప్పికొడతామని స్పష్టీకరణ
- మంత్రి అనితను ఎదుర్కోలేకే వైసీపీ నీచ రాజకీయాలని విమర్శ
డీఎస్సీ నియామకాల విషయంలో జగన్ తప్పుడు ప్రచారంతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరించి డీఎస్సీపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రొయ్యల మేత ధరలు జగన్ హయాంలో ఎంతలా పెరిగాయో ఆధారాలతో సహా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు కులాన్ని ఆపాదించడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు.
గతంలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడం తమ తప్పేనని అంగీకరించిన అచ్చెన్నాయుడు, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు, గణాంకాలతో జగన్ చేసే ప్రతి ఆరోపణను తిప్పికొడతామన్నారు. హోం మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేకనే వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే స్పృహ లేకుండా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం సహా గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని జగన్‌కు, కూటమి మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.