తమ ఎంపీలు పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఉద్ధవ్ థాకరే స్పందన

  • శివసేన (యూబీటీ) ఎంపీలు షిండే పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం
  • పార్టీ మారడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందన్న థాకరే
  • పార్టీలోనే ఉండాలని ఎవరినీ బలవంతం చేయబోమని వెల్లడి
శివసేన (యూబీటీ) ఎంపీలు ఏకనాథ్ షిండే పార్టీ (శివసేన)లో చేరబోతున్నారని వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్రంగా స్పందించారు. పార్టీని వదిలిపోవడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉందని, వారిని ఎవరినీ ఉండమని బలవంతం చేయబోమని స్పష్టం చేశారు.

2022లో జరిగిన భారీ చీలికను గుర్తు చేస్తూ ఉద్ధవ్ మాట్లాడుతూ, “అప్పట్లో 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఎవరినీ పార్టీలో ఉండమని బలవంతం చేయాలనుకోలేదు. ఇప్పుడు కూడా మాది అదే అభిప్రాయం” అని వెల్లడించారు. పార్టీని వీడిన వారు ఒకరోజు తప్పకుండా పశ్చాత్తాపపడతారని, అయితే అప్పటికి సమయం మించిపోయి ఉంటుందని అన్నారు. “ఈ రోజు సమయం మనది కాకపోవచ్చు, కానీ రేపు మనదే. అంతవరకు ఓపికగా ముందుకు సాగుతాం” అని అన్నారు.

ప్రస్తుతం ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో షిండే వర్గం ఠాక్రే సేన ఎంపీలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఈ మేరకు స్పందించారు. మరోవైపు, ఈ వార్తలను శివసేన (యూబీటీ) సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఎంపీలు పార్టీ వీడబోతున్నారనే సమాచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

Uddhav Thackeray
Shiv Sena UBT
Eknath Shinde
Maharashtra Politics
Shiv Sena MP Defection
Sanjay Raut

More Telugu News