మ్యాచ్ ముగియగానే వెళ్లిపోమన్నారు.. ఫిఫా, అమెరికాపై ఇరాన్ విమర్శలు

  • మ్యాచ్ అనంతరం వెంటనే లాస్ ఏంజెల్స్ వీడాలన్నారని ఆరోపణ
  • వీసా సమస్యలతో సపోర్ట్ స్టాఫ్‌లో పలువురు గైర్హాజరు
  • ‘ప్రపంచకప్‌లో అత్యంత బాధిత జట్టు మాదే’ అన్న కోచ్
  • ఫిఫా మరింత సహకరించాలని కోరిన కెప్టెన్ తారెమీ
ఫిఫా ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో 2-2తో డ్రా అయిన తర్వాత ఇరాన్ జట్టు ఫిఫా యాజమాన్యం సహా అమెరికా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే లాస్ ఏంజెల్స్‌ను విడిచి మెక్సికోలోని తమ శిక్షణ కేంద్రానికి వెళ్లాలని ఆదేశించారని ఆరోపించింది. దీంతో ఆటగాళ్ల రికవరీ ప్రక్రియ దెబ్బతిందని ఇరాన్ ప్రధాన కోచ్ అమీర్ ఘలెనోయి ఆరోపించారు.

టోర్నీలో పాల్గొంటున్న జట్లలో తమదే అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమ్‌ అని అమీర్‌ వ్యాఖ్యానించారు. ఫెడరేషన్ ప్రతినిధులు, మీడియా సిబ్బంది, మేనేజ్‌మెంట్ సభ్యులు చాలామంది వీసాలు పొందలేకపోయారన్నారు. దీంతో జట్టు ప్రాక్టీస్‌, ఏర్పాట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు.

ఇరాన్ కెప్టెన్ మెహ్దీ తారెమీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టిజువానా నుంచి లాస్ ఏంజెల్స్‌కు ప్రయాణం సాధారణంగా కొన్ని గంటలే అయినా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల కారణంగా దాదాపు ఐదు గంటలు పట్టిందన్నారు. ఇటువంటి పరిస్థితులు ఆటగాళ్ల ఫిట్‌నెస్, మ్యాచ్ సన్నద్ధతపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు.

అయితే మ్యాచ్ అనంతరం ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో తమ డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చి మాట్లాడారని తారెమీ వెల్లడించారు. ఫిఫా తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని సహకరించాలని కోరామన్నారు. మరోవైపు మెక్సికో ప్రభుత్వం, టిజువానా ప్రజలు తమకు అందించిన ఆతిథ్యాన్ని ఇరాన్ జట్టు ప్రశంసించింది.

Iran National Football Team
FIFA World Cup
Amir Ghalenoei
Mehdi Taremi
Gianni Infantino
US Immigration issues

More Telugu News