టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ.. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు

  • సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ కీలక సమావేశం
  • అమరావతి సహా అర్బన్ గవర్నెన్స్‌లో సహకారం కోరిన ముఖ్యమంత్రి
  • ఏపీ నుంచి ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల దిగుమతికి విజ్ఞప్తి
  • సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ కనెక్టివిటీపై ఫలవంతమైన చర్చలు
సింగపూర్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, సోమవారం అక్కడ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అనంతరం ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీలోని విమానాశ్రయాల నుంచి సింగపూర్‌కు, అలాగే ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు, ఎయిర్ కనెక్టివిటీని పెంచే అవకాశాలపై ఫలవంతమైన చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిస్తున్న అవకాశాలను సింగపూర్ విదేశాంగ మంత్రికి వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలను, దాని భవిష్యత్ దార్శనికతను ఆయనకు తెలియజేశారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ వేగంగా అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభ్యతతో పాటు, సేవల రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని వివరించారు. 

రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టుల ద్వారా సరకు రవాణాకు ఉన్న అనుకూలతలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ దేశంలోనే కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఏర్పాటు, ప్రపంచంతో ఏపీని అనుసంధానించే సబ్-సీ కేబుల్ ప్రాజెక్టుల గురించి తెలిపారు. అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దుతున్నామని, ఉత్తరాంధ్రలో ప్రపంచ దిగ్గజ ఉక్కు సంస్థ ఆర్సెలార్ మిట్టల్ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య సహకారానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అమరావతి సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్‌లో సింగపూర్ నైపుణ్యాన్ని, సహకారాన్ని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలతో పాటు యూనివర్సిటీల్లో పరిశోధనలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్‌లో సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న పంటల గురించి సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పండిస్తున్న ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా రెండు ప్రాంతాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ చర్చల సందర్భంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అమరావతి రాజధాని నిర్మాణం గురించి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల గురించి ఆసక్తి కనబరిచారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా అమరావతి నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సమావేశాల్లో సీఎం వెంట రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సింగపూర్‌లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే తదితరులు పాల్గొన్నారు.



Chandrababu Naidu
Singapore PM Lawrence Wong
Amaravati Capital City
AP Singapore Air Connectivity
Green Energy Andhra Pradesh
Andhra Pradesh Singapore Partnership

More Telugu News