హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి

  • హైదరాబాద్‌ సాంస్కృతిక సామరస్యానికి సాలార్‌జంగ్ మ్యూజియం నిదర్శనమన్న భట్టి విక్రమార్క
  • మ్యూజియం 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం
  • మ్యూజియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న భట్టి విక్రమార్క
  • ఈ నెల 21 వరకు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణ
హైదరాబాద్ నగర స్ఫూర్తికి, సాంస్కృతిక సామరస్యానికి సాలార్‌జంగ్ మ్యూజియం నిలువెత్తు నిదర్శనమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మ్యూజియం 75వ వార్షికోత్సవం, సాలార్‌జంగ్-III, 137వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విభిన్న సంస్కృతులు, విశ్వాసాలకు నిలయంగా ఉన్న ఈ మ్యూజియం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. సాలార్‌జంగ్ మ్యూజియం వివిధ సంస్కృతుల మధ్య సామరస్యానికి ప్రతీక అని, ఇది ఒక అపురూపమైన జాతీయ సంపద అని అభివర్ణించారు. జూన్ 14 నుంచి 21 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ప్లాటినం జూబ్లీ వేడుకల ద్వారా మ్యూజియం విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా మరింత చాటిచెప్పేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

సాలార్‌జంగ్-IIIగా ప్రసిద్ధి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ ఒక్కరే సేకరించిన అరుదైన కళాఖండాలతో ఈ మ్యూజియం ఏర్పాటైంది. 1951లో మూసీ నది ఒడ్డున ప్రారంభమైన ఈ మ్యూజియం, నేడు దేశంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.                                

Salar Jung Museum
Mallu Bhatti Vikramarka
Hyderabad
Salar Jung III
Telangana Government
Platinum Jubilee Celebrations

More Telugu News