హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్

  • రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్న బండి సంజయ్
  • మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్య
  • సేంద్రీయ సాగు చేసే రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్న సంజయ్

దేశంలో రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, చివరికి మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో పాలు తాగి తాను మూడు రోజులు ఆసుపత్రి పాలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


ప్రస్తుతం భూమంతా కెమికల్స్‌తో నిండిపోయిందని, ఈ రోగాలకు కారణం, నివారణ రెండూ మన చేతుల్లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2,400 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రారంభంలో రెండు, మూడేళ్లు లాభాలు రాకపోయినా, ఆ తర్వాత సేంద్రీయ సాగు చేసే రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్నారు. ప్రజలు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.


యూరియా సబ్సిడీ కోసం బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అందులో రూ. 1.20 లక్షల కోట్లు విదేశాల నుంచి యూరియా దిగుమతికే వెచ్చించడం బాధాకరమన్నారు. రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తామని, ఆ పంటలకు మద్దతు ధర లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. విదేశీ దిగుమతులను తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులను పెంచడానికే మోదీ ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహిస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.


Bandi Sanjay
Adulterated Milk
Natural Farming
Organic Farming Budget
Karimnagar Farmers Meeting
Kisan Morcha

More Telugu News