నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు!
- ఎమ్మెల్యే జూలకంటికి విజయాబాయి, శ్రీను నాయక్ ఫిర్యాదు
- తురకా కిషోర్ నకిలీ పత్రాలతో మోసం చేశారని ఆవేదన
- కిషోర్, చల్లా శివపై క్రిమినల్ కేసులు నమోదు
పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాల్లో మరో సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌పై నకిలీ ఇంటి పట్టాలు సృష్టించి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై మాచర్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూమిని చూపిస్తూ నిరుపేదలను నమ్మించి, డబ్బులు వసూలు చేసి ఈ మోసానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా రెవెన్యూ, అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో బాధితులకు ఇచ్చిన పట్టాలు ముమ్మాటికీ నకిలీవని, ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
ఆరోపణల్లో నిజముందని తేలడంతో, రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా మాచర్ల పోలీస్ స్టేషన్లో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్, అతడికి సహకరించిన చల్లా శివపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ నకిలీ పట్టాల కుంభకోణంపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి నకిలీ పట్టాల దందాలు ఇంకా ఎక్కడెక్కడ జరిగాయనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.