రూ.9.63 కోట్ల పన్ను చెల్లించండి.. జొమాటోకు ఏపీ ప్రభుత్వం నోటీసు

  • ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏపీ జీఎస్టీ విభాగం షాక్
  • రూ.9.63 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో డిమాండ్ నోటీసు జారీ
  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ తక్కువగా చెల్లించారని ఆరోపణ
  • నోటీసులపై అప్పీల్ చేస్తామని ప్రకటించిన జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు ఏపీ జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విభాగం ఊహించని షాక్ ఇచ్చింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఏకంగా రూ.9.63 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, తక్కువ పన్ను చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు జొమాటో మాతృసంస్థ అయిన 'ఎటెర్నల్' (Eternal) కు ఈ నోటీసు అందింది.

వివరాల్లోకి వెళితే.. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య కాలానికి సంబంధించిన జీఎస్టీ లెక్కల్లో లోపాలు ఉన్నాయని ఏపీ జీఎస్టీ అధికారులు ఆరోపించారు. వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే తక్కువగా పన్ను చెల్లించారని పేర్కొన్నారు. ఈ మేరకు తమకు జూన్ 9న ఏపీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఆర్డర్ అందినట్లు జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.

జీఎస్టీ అధికారులు జారీ చేసిన నోటీసు ప్రకారం.. మొత్తం రూ.9.63 కోట్ల డిమాండ్‌లో అసలు పన్ను బకాయి రూ.6.49 కోట్లుగా ఉంది. దీనిపై వడ్డీగా రూ.2.50 కోట్లు, పెనాల్టీ కింద మరో రూ.64.87 లక్షలు కలిపి చెల్లించాలని ఆదేశించారు. ఈ నోటీసుపై కంపెనీ స్పందిస్తూ, తాము దీనిపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు స్పష్టం చేసింది.

"2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి కాలానికి సంబంధించి జీఎస్టీ డిమాండ్‌ను నిర్ధారిస్తూ కంపెనీకి 2026 జూన్ 9న ఒక ఆర్డర్ అందింది. అయితే, ఈ విషయంలో మా వాదనలో బలమైన అంశాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము. కంపెనీ ఈ ఉత్తర్వుపై సంబంధిత అధికార సంస్థ ముందు అప్పీల్ దాఖలు చేస్తుంది" అని ఎటెర్నల్ సంస్థ తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక కార్యకలాపాలపై గానీ, ఇతర కార్యకలాపాలపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని కూడా స్పష్టం చేసింది.

Zomato
Andhra Pradesh GST notice
Eternal tax evasion
Online food delivery tax
GST demand order
AP GST department

More Telugu News