భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్!
- అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన భారతీరాజా
- తీవ్ర విషాదంలో మునిగిపోయిన సినీ ప్రపంచం
- భారతీరాజా మరణం కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అన్న పవన్
భారతీయ చలనచిత్ర రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన అద్భుతమైన సృజనాత్మకతతో వెండితెరపై సరికొత్త ఒరవడిని సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఈ రోజు ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ ప్రపంచం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతీరాజా మరణం భారతీయ చలనచిత్ర రంగానికి, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భారతీరాజా కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా.. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని పవన్ కల్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవితో భారతీరాజా గారు రూపొందించిన 'ఆరాధన' చిత్రం, అలాగే జాతీయ అవార్డు సాధించిన క్లాసిక్ ఫిల్మ్ 'సీతాకోకచిలుక' వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.
గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలలోని సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన సిద్ధహస్తులని శ్లాఘించారు. తన కెరీర్‌లో ఏకంగా 6 జాతీయ అవార్డులను అందుకుని భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.