నారా లోకేశ్ నియంతలా వ్యవహరిస్తున్నారు: గుడివాడ అమర్‌నాథ్

  • స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్న అమర్‌నాథ్ 
  • కార్మిక సంఘాలను బెదిరించే ధోరణిలో లోకేశ్ మాట్లాడారని విమర్శ
  • ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ తనూజ రాణి డిమాండ్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రమాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రస్తుతం ‘రెడ్‌బుక్’ అరాచకం నడుస్తోందని... లోకేశ్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేజీహెచ్ వద్ద న్యాయం అడిగిన కార్మిక సంఘాలను లోకేశ్ తీవ్రంగా అవమానించారని, వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన అమర్‌నాథ్.. స్టీల్‌ ప్లాంట్‌ బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


మరోవైపు, ఈ ఘోర ప్రమాదంపై అరకు వైసీపీ ఎంపీ తనూజ రాణి కూడా స్పందించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం కేవలం భద్రతా వైఫల్యాల వల్లే జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరగాలన్నారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని.. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారంతో పాటు, ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితుల పునరావాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.


Gudivada Amarnath
Nara Lokesh
Visakhapatnam Steel Plant
YSRCP
Andhra Pradesh Politics
Vizag Steel Plant Accident

More Telugu News