తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పై సస్పెన్షన్ వేటు

  • అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలతో రాము నాయక్ పై వేటు
  • అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిన వైనం
  • ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారిని వదిలేది లేదన్న మంత్రి పొంగులేటి

తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 2013-18 మధ్య హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో రాము నాయక్ పలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలన చేస్తుండగా ఈ లీలలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో గజం రూ.2 లక్షలకు పైగా పలికే హైకోర్టు సమీపంలోని హౌసింగ్ బోర్డు స్థలాన్ని, గతంలో తొలగించబడిన వర్క్ ఇన్‌స్పెక్టర్ భార్య పేరిట 2018లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. దీనికి సహకరించిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్‌పైనా విచారణకు ఆదేశించారు.


విజయ్‌నగర్ కాలనీ, లక్ష్మిగూడ సహా పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను అక్రమంగా బదిలీ చేసినట్లు రాము నాయక్‌పై 2017 నుంచి కేసులు ఉన్నాయి. ఈ దందాకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు.


Ramu Nayak
Deputy Collector Suspension
Telangana Land Scam
Ponguleti Srinivas Reddy
Hyderabad Housing Board
Revenue Department Telangana

More Telugu News