రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు

  • చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సజ్జనార్ వెల్లడి
  • వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మంది నగరానికి చేరుకున్నారన్న సీపీ
  • అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని స్పష్టీకరణ 

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌లు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారని... దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది ఇప్పటికే నగరానికి చేరుకున్నారని ఆయన తెలిపారు.


భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెయ్యి మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని... ఈ భద్రతా చర్యలను గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని, అత్యవసర వైద్య సేవల కోసం ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వివిధ భాషల్లో భక్తులకు సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని సీపీ స్పష్టం చేశారు. స్థానికులు రద్దీని బట్టి రేపైనా వచ్చి ప్రసాదం తీసుకోవచ్చని సూచించారు. షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిరంతరం నిఘా ఉంచుతారని చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వాళ్లు రాత్రి వేళల్లో పోలీసులకు సహకరించాలని కోరారు.


Chepa Prasadam
VC Sajjanar
Nampally Exhibition Ground
Hyderabad Fish Medicine
Ponnam Prabhakar
Telangana Police security

More Telugu News