హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్ నాథ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
- జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయిన అమర్నాథ్
- జగన్ మోహన్ రావు నకిలీ పత్రాలు చెల్లించారంటూ బీసీసీఐకి ఫిర్యాదు
- రన్నరప్ అమర్నాథ్ను అధ్యక్షుడిగా ప్రకటించిన జస్టిస్ కైత్
- అమర్నాథ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమన్న హైకోర్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాల్లో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేస్తూ, అతడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
2023 అక్టోబర్ ఎన్నికల్లో అమర్నాథ్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నాటి అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. అయితే, జగన్ మోహన్ రావు సమర్పించిన 'శ్రీ చక్ర క్లబ్' పత్రాలు నకిలీవని, ఆ క్లబ్ ఉనికిలోనే లేదని అమర్నాథ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో 2018లోనే జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ఈ క్లబ్ మార్పు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, హెచ్‌సీఏ కార్యకలాపాలు ఆగకూడదనే ఉద్దేశంతో రన్నరప్‌గా నిలిచిన అమర్నాథ్ను అధ్యక్షుడిగా జస్టిస్ కైత్ ప్రకటించారు.
అయితే, రన్నరప్‌గా ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అమర్నాథ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ తీర్పుతో హెచ్‌సీఏలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది.