ఇరాన్‌కు సాయం చేసి సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే..!
- ఇరాన్‌కు ఆర్థిక సాయం చేసిన ఇద్దరు భారత సోదరులను అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు
- యూపీకి చెందిన ఈ సోదరులు సౌదీలోని దమ్మామ్‌లో మార్చి నెలలో అరెస్ట్
- తల్లి కోరిక మేరకు ఇరాన్ ఖాతాకు 200 రియాల్స్ పంపడంతో ఈ ఘటన
- తమ పిల్లలను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వారి తల్లిదండ్రులు, షియా లా బోర్డు
- భద్రతా వ్యవహారంలోనే వారిని నిర్బంధించినట్లు రియాద్‌లోని భారత ఎంబసీ వెల్లడి
అసలేం జరిగింది?
పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, తల్లిని యూపీలోని వారి స్వగ్రామంలో వదిలి, మహమ్మద్ జాఫర్ ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియాలోని దమ్మామ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ దుకాణంలో పని చేస్తూ, తర్వాత తన తమ్ముడు రహిబ్‌ను కూడా తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించాడు. అయితే, కొన్ని నెలల క్రితం వారి తల్లి భారత్ నుంచి ఫోన్ చేసి, ఇజ్రాయెల్-అమెరికా దాడులతో ఇబ్బందులు పడుతున్న ఇరాన్ ప్రజలకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరారు.
తల్లి కోరిక మేరకు జాఫర్ సుమారు 200 సౌదీ రియాల్స్‌ను భారత్‌లోని ఇరాన్ ఎంబసీ బ్యాంకు ఖాతాకు పంపుతానని చెప్పాడు. ఈ డబ్బును తన తమ్ముడు రహిబ్ ఫోన్‌ను ఉపయోగించి బదిలీ చేశాడు. ఇరాన్‌తో సౌదీ అరేబియాకు తీవ్ర వైరం ఉండటంతో ఈ చిన్న లావాదేవీ వారిని చిక్కుల్లో పడేసింది. మార్చి 27న సౌదీ భద్రతా సిబ్బంది వారి ఇంటికి వచ్చి, లావాదేవీకి ఉపయోగించిన ఫోన్ రహిబ్‌ది కావడంతో అతడిని మొదట అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల తర్వాత మార్చి 30న అన్న జాఫర్‌ను కూడా నిర్బంధించి తీసుకెళ్లారు. అప్పటి నుంచి వారి గురించి కుటుంబానికి ఎలాంటి సమాచారం లేదు.
ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కుటుంబం
సౌదీలో తమ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారని, వారి ఖర్చుల మీదే తాము బతుకుతున్నామని తండ్రి హసన్ అబ్బాస్ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుల ఆచూకీ కనుగొని, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు (AIMPLB) ప్రధాన కార్యదర్శి మౌలానా యసూబ్ అబ్బాస్ ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. మధ్యప్రాచ్యంలో ఇలా నిర్బంధానికి గురవుతున్న షియా భారతీయులను ఆదుకోవాలని ఆయన కోరారు.
స్పందించిన భారత రాయబార కార్యాలయం
ఈ విషయంపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. కమ్యూనిటీ వెల్ఫేర్ విభాగానికి చెందిన సుమిత్ కుమార్, ఆ సోదరుల కుటుంబానికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. "మహమ్మద్ జాఫర్, రహిబ్‌లను భద్రతా సంబంధిత వ్యవహారంలో నిర్బంధించారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించాం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది" అని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఆర్థిక సాయం చేసినందుకే సౌదీ అధికారులు వారిని అరెస్ట్ చేశారని కుటుంబం ఆరోపిస్తుండగా, అధికారికంగా కారణాలు వెల్లడికావాల్సి ఉంది.