అర్ధరాత్రి బేస్ క్యాంప్ నుంచి ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం!

Babita Pandey MBA student disappears from base camp at midnight
  • ఉత్తరాఖండ్ దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్‌లో  ఘటన 
  • మే 29న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థిని బబితా పాండే అదృశ్యం 
  • కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి
  • బబిత స్నేహితులు ఇద్దరి అరెస్ట్ 
  • ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లతో గాలింపు
  • నకిలీ పర్మిట్ ఇచ్చిన 'ప్రో మౌంటైన్' ఏజెన్సీ సీజ్
ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లాలోని హిమాలయ పర్వతాల పరిసరాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఒక ఎంబీయే విద్యార్థిని బబితా పాండే (23) గత పది రోజులుగా కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ మార్గంలోని గోయ్ బేస్ క్యాంప్ నుంచి మే 29 అర్ధరాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం గాలింపు చర్యలను ఉద్ధృతం చేసింది. ఘటనా స్థలంలో దట్టమైన అడవులు, లోయలు ఉండటంతో శనివారం నుంచి హెలికాప్టర్లతో పాటు నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (NIM) ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు.

నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌కు చెందిన బబితా పాండే.. తన స్నేహితులైన హర్మాన్‌పాల్ సింగ్, హర్మాన్‌ప్రీత్ సింగ్‌లతో కలిసి మే 29న ఉత్తరకాశీ చేరుకుంది. రైతల్ గ్రామం నుంచి వీరు ట్రెక్కింగ్ ప్రారంభించి, రాత్రికి గోయ్ బేస్ క్యాంప్‌లో టెంట్లు వేసుకుని బస చేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత బబితా అక్కడ నుంచి మాయమైంది. బబితా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి మధ్య ఏవైనా వ్యక్తిగత గొడవలు జరిగాయా? లేక మరేదైనా కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు సాగుతోంది.

భారీగా రంగంలోకి బలగాలు
మే 30 నుంచి దాదాపు 150 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది 5 కిలోమీటర్ల పరిధిలో విస్తృతంగా గాలిస్తున్నారు. ఎత్తైన పర్వత ప్రాంతాలు కావడంతో ఆదివారం నుంచి హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే అడవుల్లో స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను ఉపయోగించడంతో పాటు బేస్ క్యాంప్ సమీపంలోని ఒక సరస్సులో డ్రైవింగ్ టీమ్స్ (ఈతగాళ్లు) సాయంతో గాలింపు జరుపుతున్నారు. అయినప్పటికీ బబితా జాడ దొరకకపోవడంతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 నకిలీ పర్మిట్ల బట్టబయలు 
ఈ కేసు దర్యాప్తులో పర్యాటక శాఖకు సంబంధించిన ఒక పెద్ద అక్రమం వెలుగుచూసింది. ఈ ముగ్గురు యువతీ యువకులు అధికారిక పోర్టల్ ద్వారా ఎలాంటి డిజిటల్ పర్మిట్లు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. గడువు ముగిసిపోయిన పాత ఫిజికల్ పర్మిట్‌పై పేర్లు మార్చి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వీరు ట్రెక్కింగ్‌కు వెళ్లినట్లు తేలింది. దీనికి సహకరించిన రైతల్ బేస్డ్ ట్రావెల్ ఏజెన్సీ 'ప్రో మౌంటైన్' (Pro Mountain) రిజిస్ట్రేషన్‌ను మోసం కేసు కింద అధికారులు సస్పెండ్ చేశారు. రోజురోజుకూ సమయం గడిచిపోతుండటం, హిమాలయాల్లో వాతావరణం క్లిష్టంగా మారుతుండటంతో బబితా క్షేమంగా తిరిగిరావాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు.
Go Back to Shorts
Babita Pandey
Uttarkashi trekking
Dayara Bugyal trek
Missing MBA student
Uttarakhand rescue operation
Pro Mountain travel agency

More Telugu News