‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకు అందని ఆహ్వానం.. కారణమిదే!

Vijay TVK party not invited to INDI Alliance meeting here is the reason
  • నేడు ఢిల్లీలో ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి భేటీ
  • హాజరుకానున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు
  • ఎంపీలు ఉన్న పార్టీలనే ఆహ్వానించినట్లు కాంగ్రెస్‌ వివరణ
  • ఒక్క ఎంపీలేని టీవీకేకు అందుకే ఆహ్వానం అందలేదని సమాచారం
ఢిల్లీలో నేడు ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి భేటీ కానుంది. దీనికి తమిళనాడులో ఇటీవలే అధికారంలోకి వచ్చిన విజయ్‌ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) హాజరవడంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఈ సమావేశానికి ఆ పార్టీకి ఇంకా ఆహ్వానం పంపలేదని సమాచారం. దీనిపై కూటమి నేతలు ఈరోజు సాయంత్రంలోగా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ పార్టీకి కాంగ్రెస్ ప్రధాన మిత్రపక్షంగా ఉంది. అయినప్పటికీ ఈ సమావేశానికి విజయ్ పార్టీని పిలవకపోవడంపై కాంగ్రెస్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. కేవలం పార్లమెంట్ సభ్యులున్న రాజకీయ పార్టీలను మాత్రమే ఆహ్వానించామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ‘టీవీకే’కు ఎలాంటి ఎంపీల ప్రాతినిధ్యం లేదు. అందుకే ఆ పార్టీకి ఇంకా ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ తమ కూటమిని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తమకు దక్కిన ఏకైక ఖాళీ రాజ్యసభ సీటును మిత్రపక్షమైన కాంగ్రెస్‌కే కేటాయించారు. ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటముల తర్వాత.. ప్రతిపక్షాల వ్యూహాలను మార్చేందుకు ఈ ‘ఇండీ’ కూటమి అత్యవసరంగా సమావేశమవుతోంది.

కూటమి ఐక్యతను చాటడానికి, అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడానికి జరుగుతున్న ఈ సదస్సుకు 23 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ వంటి బడా నేతలు ఈ భేటీలో పాల్గొని భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారు.
Go Back to Shorts
Thalapathy Vijay
Tamilaga Vettri Kazhagam
INDI Alliance Meeting Delhi
Congress Party
Opposition Unity Meeting
Tamil Nadu Politics

More Telugu News