లైవ్ ఇంటర్వ్యూలో రచ్చ.. యాంకర్‌ను అవమానించి.. మైక్ విసిరి వెళ్లిపోయిన ట్రంప్

Donald Trump slams NBC anchor Kristen Welker during Meet the Press interview
  • ఎన్బీసీ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన డొనాల్డ్ ట్రంప్
  • ఎన్నికల రిగ్గింగ్‌పై ఆధారాలు అడగడంతో తీవ్ర ఆగ్రహం
  • యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై 'వంకర బుద్ధి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • చర్చ మధ్యలోనే మైక్రోఫోన్ తీసి నేలపై పడేసి నిష్క్రమణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ప్రముఖ వార్తా సంస్థ ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు తీవ్ర ఆగ్రహానికి గురై, ఆమెను దారుణంగా అవమానించి, మధ్యలోనే కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. తనపై ప్రశ్నల వర్షం కురిపించిన యాంకర్‌ను 'వంకర బుద్ధి కలదానివి', 'మూర్ఖురాలివి' అంటూ సంభోదిస్తూ, చేతిలోని మైక్రోఫోన్‌ను నేలపై విసిరి కొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. ఎన్బీసీ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'మీట్ ది ప్రెస్' కార్యక్రమం కోసం యాంకర్ క్రిస్టెన్ వెల్కర్, డొనాల్డ్ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేశారు. కాలిఫోర్నియాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యం కావడంపై ట్రంప్ మాట్లాడుతూ.. "నాలుగైదు రోజులు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించడం లేదు. ఎందుకంటే వారు ఎన్నికల్లో మోసం చేస్తున్నారు" అని ఆరోపించారు.

ట్రంప్ ఆరోపణలపై స్పందించిన యాంకర్ క్రిస్టెన్.. "మీ ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా?" అని సూటిగా ప్రశ్నించారు. దీనికి ట్రంప్.. "నేను చూడటమే ఆధారం, ప్రజలు చెప్పేది వింటున్నాను" అని సమాధానమిచ్చారు. అయితే, అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, పదేపదే స్పష్టమైన ఆధారం చూపాలని క్రిస్టెన్ కోరారు.

దీంతో ట్రంప్ సహనం కోల్పోయారు. యాంకర్‌పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. "అధికారులు వంకర బుద్ధి కలవారు. నువ్వు కూడా వంకర బుద్ధి దానివే. మీ మీడియా అంతా మోసపూరితం. 'మీట్ ది ప్రెస్' కూడా వంకర కార్యక్రమమే" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి యాంకర్.. "క్షమించండి, నేను వంకర బుద్ధి దాన్ని కాదు" అని బదులిచ్చే ప్రయత్నం చేయగా, ట్రంప్ మరింత రెచ్చిపోయారు. "నువ్వు వంకర బుద్ధి దానివి లేదా మూర్ఖురాలివి. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని మీ నెట్‌వర్క్‌కు కూడా తెలుసు. ఏబీసీ, సీబీఎస్, సీఎన్ఎన్ అన్నీ ఏకపక్షంగా వ్యవహరించే మోసపూరిత సంస్థలే" అంటూ ఆరోపించారు.

అనంతరం "క్షమించు, ఇక చాలు. నాకు విసుగొచ్చింది. థ్యాంక్యూ డార్లింగ్, నీ పని నువ్వు చేసుకో" అని అంటూ తన మైక్రోఫోన్‌ను తీసి నేలపై పడేశారు. ఈ ఇంటర్వ్యూ కోసం తాను విస్కాన్సిన్‌కు వచ్చానని యాంకర్ చెప్పబోగా, "నీకోసం నేను గంట పాటు వర్షంలో కూర్చున్నాను. నీకు చాలా సమయం ఇచ్చాను" అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇటీవల కాలంలో ట్రంప్ జర్నలిస్టులపై ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం సీఎన్ఎన్ రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్‌ను ఉద్దేశిస్తూ.. "ఆమె కళ్లలో ద్వేషం కనిపిస్తుంది, ఎప్పుడూ నవ్వదు" అని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Donald Trump
NBC Interview
Kristen Welker
Meet the Press
Trump Walkout Video
US Election Rigging Claims

More Telugu News