కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా.. రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి
- కర్ణాటక కాంగ్రెస్‌లో చల్లారిన అసంతృప్తి సెగ
- మంత్రి పదవికి రాజీనామాపై వెనక్కి తగ్గిన రామలింగారెడ్డి
- డీకే శివకుమార్ జోక్యంతో గంటల్లోనే సంక్షోభానికి తెర
- అర్ధరాత్రి హోటల్‌లో సుదీర్ఘ మంతనాలతో పరిష్కారం
- మరో సీనియర్ మంత్రి మునియప్ప సైతం అసమ్మతి గళం వినిపిస్తున్న వైనం
అర్ధరాత్రి హోటల్‌లో హైడ్రామా
శుక్రవారం రాత్రి రాజీనామా ప్రకటనతో కలకలం రేపిన రామలింగారెడ్డిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. జయనగర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో అర్ధరాత్రి దాటాక రామలింగారెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పార్టీకి చెందిన మరికొందరు సీనియర్ నేతల సమక్షంలో జరిగిన ఈ మంతనాల తర్వాత వివాదం సద్దుమణిగినట్లు డీకే శివకుమార్ ప్రకటించారు. "శాఖల కేటాయింపునకు సంబంధించి తలెత్తిన కొన్ని సమస్యలపై కూర్చుని మాట్లాడుకున్నాం. ప్రస్తుతం వివాదం పరిష్కారమైంది" అని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.
తనకు కేటాయించిన నీటిపారుదల శాఖపైనే రామలింగారెడ్డి ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు డీకే తెలిపారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై స్పష్టమైన అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. "రామలింగారెడ్డి, నేను 1980ల నుంచి మంచి స్నేహితులం. పార్టీలోని సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తున్నాం. చిన్న చిన్న అభిప్రాయభేదాలను త్వరలోనే పరిష్కరించుకుంటాం" అని డీకే భరోసా ఇచ్చారు.
కొనసాగుతున్న అసమ్మతి
రామలింగారెడ్డి వివాదం ముగిసినప్పటికీ, కర్ణాటక మంత్రివర్గంలో అసంతృప్తి పూర్తిగా సమసిపోలేదని తెలుస్తోంది. మరో సీనియర్ మంత్రి కేహెచ్ మునియప్ప కూడా శాఖల కేటాయింపుపై తన సీనియారిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇంకా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఒకవైపు రామలింగారెడ్డిని శాంతింపజేసినా, మరోవైపు మునియప్ప వంటి సీనియర్ నేతల్లోని అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.