డైరెక్ట్‌ హిందీ సినిమా ఎప్పుడు? అదిరిపోయే సమాధానం ఇచ్చిన రామ్‌ చరణ్‌

Ram Charan discusses his future in Bollywood and Indian cinema
  • హిందీ, తెలుగు తేడాలేదన్న మెగా పవర్‌ స్టార్‌
  • అన్ని భాషల డైరెక్టర్లతో పనిచేయాలని ఉందని వెల్లడి
  • ప్రస్తుతం తాను చేసేవన్నీ ఇండియన్‌ సినిమాలన్న చరణ్‌
  • జంజీర్‌తో 2013లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ రామ్‌ చరణ్‌
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2013లో ‘జంజీర్’ (తెలుగులో తుఫాన్) సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పూర్తిస్థాయి హిందీ సినిమా చేయని చరణ్.. 2023లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలోని ‘యేంటమ్మ’ సాంగ్‌లో కామియో రోల్‌లో మెరిశాడు. తాజాగా శనివారం మీడియాతో మాట్లాడిన అతడు.. హిందీ సినిమాలపై తన మనసులోని మాటను పంచుకున్నాడు.

తన అభిమానులు మళ్లీ పూర్తిస్థాయి హిందీ సినిమాలో ఎప్పుడు చూడబోతున్నారనే ప్రశ్నకు చరణ్ చాలా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. ‘‘నాకు హిందీ, తెలుగు సినిమా అనే తేడాలు తెలియవు. నేను చేస్తున్నవన్నీ కేవలం ‘ఇండియన్ సినిమాలు’ మాత్రమే. భవిష్యత్తులో కూడా సినిమాలను అలాగే చూద్దాం’’ అని చరణ్ స్పష్టం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన విజయం తర్వాత చరణ్ పాన్-ఇండియా స్థాయిలో ప్లాన్‌ చేసుకుంటున్నట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

సినిమా రంగానికి భాషా హద్దులు లేవంటున్న రామ్ చరణ్.. తనకు అన్ని పరిశ్రమల దర్శకులతో కలిసి పనిచేయాలని ఉందని వెల్లడించారు. ముంబైకి చెందిన హిందీ దర్శకులతో పాటు బెంగాల్, తమిళనాడు ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రతిభావంతులైన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కథలను, సంస్కృతులను తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు అందించాలనేది తన ఆకాంక్ష అని చరణ్ పేర్కొన్నారు.

ఇక 1973లో ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఒరిజినల్ ‘జంజీర్’ బాలీవుడ్‌లో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. చరణ్ నటించిన రీమేక్ వెర్షన్‌లో ఆతడే స్వయంగా ‘ముంబై కే హీరో’ అనే పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా మారడం విశేషం.
Go Back to Shorts
Ram Charan
Indian Cinema
Bollywood
Zanjeer
RRR
Pan India movies
Telugu cinema
Hindi films
Ram Charan interview
Global star Ram Charan

More Telugu News