ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు
- సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే హక్కు రేవంత్ కు లేదన్న హరీశ్
- కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదని వ్యాఖ్య
- ఈ ఏడాది 75 శాతం కృష్ణా నీటిని ఏపీ వాడుకుందని ఆరోపణ
పాలమూరు ప్రాజెక్టు సందర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డివి "మతిలేని మాటలు" అంటూ ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
నేడు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన హరీశ్ రావు...బీఆర్ఎస్ చేపట్టబోయే పాదయాత్ర భయంతోనే సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర కరువైందని, సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. "అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ 75 శాతం కృష్ణా నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 25 శాతానికే పరిమితమైంది" అని హరీశ్ రావు ఆరోపించారు.
ఈ వైఫల్యానికి గానూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. పాలమూరు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని, రాబోయే రోజుల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని మళ్లీ ఓడించి, పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.