లండన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి సభలో ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యల కలకలం!

  • ప్రసంగానికి అంతరాయం కలిగించిన నిరసనకారులు
  • ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలపై నిలదీసినట్లు వీడియోలు వైరల్
  • నిర్వాహకుల జోక్యంతో నిలిచిపోయిన ప్రశ్నల పర్వం
  • సభ్యత లేని ప్రవర్తనంటూ భారత హైకమిషన్ ఖండన
  • ఏఐ సాంకేతికతపై సీజేఐ కీలక ప్రసంగం
లండన్‌లోని బిర్క్‌బెక్ కాలేజీలో జూన్ 4న జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగానికి కొందరు ప్రేక్షకులు అంతరాయం కలిగించడం తీవ్ర కలకలం రేపింది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - అంతర్జాతీయ చట్టాలు’ అనే అంశంపై సీజేఐ తన ఉపన్యాసం ముగించిన తర్వాత ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్’ సెషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సదస్సులో పాల్గొన్న కొందరు ప్రేక్షకులు.. భారత్‌లో భిన్నాభిప్రాయాలను, నిరసనలను అణచివేస్తున్నారంటూ సీజేఐని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అలాగే ఇటీవల ఆయన చేసిన ‘కాక్రోచ్‌’ (బొద్దింకలు) వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిలదీశారు. అయితే ఆ ప్రశ్నలు సదస్సు ప్రధానాంశానికి సంబంధించినవి కావని పేర్కొంటూ నిర్వాహకులు మధ్యలోనే జోక్యం చేసుకుని వారి మైకులను కట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై లండన్‌లోని భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. సీజేఐ హాజరైన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో కొందరు ప్రదర్శించిన ‘అభ్యంతరకమైన ప్రవర్తన’ను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యంలో ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని సభ్యతతో, గౌరవప్రదమైన రీతిలో వ్యక్తపరచాలే తప్ప.. ఇలాంటి అంతరాయాలు కలిగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.

ఈ వివాదానికి ముందు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తన ప్రసంగంలో.. సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ అది ఎప్పుడూ రాజ్యాంగ విలువలకూ, ప్రజాస్వామ్యానికి, మనుషుల గౌరవానికీ లోబడి జవాబుదారీగా ఉండాలని నొక్కిచెప్పారు. రాబోయే దశాబ్ద కాలంలో మనం తీసుకునే నిర్ణయాలే సాంకేతికత, స్వేచ్ఛ, న్యాయం మధ్య ఉండే సంబంధాన్ని శాసిస్తాయని పేర్కొన్నారు.




Justice Surya Kant
London Conference
Birkbeck College
Artificial Intelligence
Cockroach comments
Indian High Commission
AI and International Law
Indian Judiciary
London protest
Justice Surya Kant London

More Telugu News