ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం!

  • ఆర్మీ పైలట్ కెప్టెన్ భరత్ తన ప్రేయసికి చేసిన ప్రపోజల్ వీడియో వైరల్
  • ఇది సైనిక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ 
  • ఈ ఘటనతో ఆర్మీ దశాబ్దాలుగా వాడుతున్న పాత 'చీతా' హెలికాప్టర్ల అంశం మళ్లీ తెరపైకి
  • మే 20న లడఖ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్  
నాసిక్‌లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్.. అక్కడ రన్‌వేపై ఉన్న ఒక 'చీతా' హెలికాప్టర్ ముందే తన కాబోయే భార్య ఆరుషికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశారు. యూనిఫాంలో, అదీ అధికారిక వాతావరణంలో ఇలాంటి పనులు చేయడం సైనిక నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు విమర్శిస్తుండగా.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేజీఎస్ ధిల్లాన్ వంటి సీనియర్ అధికారులు మాత్రం "యూనిఫాం వెనుక కూడా ఒక మనిషి ఉంటాడు" అంటూ యువ పైలట్‌కు మద్దతుగా నిలిచారు.

ఈ ప్రపోజల్ వివాదాన్ని పక్కన పెడితే.. ఈ వీడియోలో కనిపించిన 'చీతా' హెలికాప్టర్ల భద్రతపై రక్షణ వర్గాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఫ్రాన్స్ దేశపు సాంకేతికతతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నిర్మించిన ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు.. గత 50 ఏళ్లుగా సియాచిన్, లడఖ్ వంటి అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన సరిహద్దుల్లో భారత సైన్యానికి రవాణా, నిఘా సేవలను అందిస్తున్నాయి. 'ఆపరేషన్ మేఘదూత్' వంటి చారిత్రాత్మక ఘట్టాల్లో ఇవి కీలక పాత్ర పోషించాయి.

ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాల రికార్డు
చీతా హెలికాప్టర్ల ట్రాక్ రికార్డు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 'భారత్ రక్షక్' గణాంకాల ప్రకారం 1974 నుంచి 2022 మధ్య కాలంలోనే ఇవి 60కి పైగా ప్రమాదాలకు గురవగా.. ఎందరో ప్రతిభావంతులైన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) గతంలో విడుదల చేసిన నివేదికల ప్రకారం.. మూడు దశాబ్దాలలో చీతా, చేతక్ హెలికాప్టర్లు 191 సార్లు కూలిపోయాయి. వీటిని 'ఎగిరే శవపేటికలు' అని కూడా కొందరు అభివర్ణించారు. మే 20, 2026 న లడఖ్‌లోని తంగ్స్తే ప్రాంతంలో ఒక చీతా (చీతల్ వేరియంట్) సాంకేతిక లోపంతో ఇంజిన్ పవర్ కోల్పోయి కూలిపోయింది. అందులో ప్రయాణించిన మేజర్ జనరల్ సచిన్ మెహతా, మరో ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు.

ఆధునికీకరణలో అడ్డంకులు
ఈ పాత హెలికాప్టర్ల 'టోటల్ టెక్నికల్ లైఫ్' ముగుస్తుండటంతో.. 2027 నుంచి వీటిని దశలవారీగా తొలగించాలని ఆర్మీ భావిస్తోంది. వీటి స్థానంలో హెచ్ఏఎల్ (HAL) తయారు చేసిన స్వదేశీ లైట్ యూటిలిటీ హెలికాప్టర్లను (LUH) ప్రవేశపెట్టాలి. అయితే, గత మూడు నెలలుగా ఈ ఎల్‌యూహెచ్ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. హెచ్ఏఎల్, ఆర్మీ, ఎయిర్‌వర్దినెస్ ఏజెన్సీల (CEMILAC) మధ్య ఆటోపైలట్ పనితీరు, శబ్ద నియంత్రణ, ఆటోరొటేషన్ సామర్థ్యాలపై తీవ్రమైన భేదాభిప్రాయాలు రావడమే దీనికి కారణం. ఈ సర్టిఫికేషన్ వివాదం (Deadlock) కారణంగా కొత్త హెలికాప్టర్ల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే పైలట్ల రక్షణ కోసం.. ఈ పాత విమానాల స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన సరికొత్త హెలికాప్టర్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సైనిక కుటుంబాలు కోరుతున్నాయి.

Bharat Bhardwaj
Cheetah Helicopter
Indian Army
HAL Light Utility Helicopter
Army Aviation Training School Nashik
Cheetah Helicopter Safety Issues
Indian Army Pilot Proposal
HAL LUH Project Delay
Flying Coffins Indian Army
KJS Dhillon

More Telugu News