అందుబాటులోకి 'ఇ-85' ఇంధనం.. పెట్రోల్ కంటే రూ.20 తక్కువకే!

Hardeep Singh Puri launches E85 fuel which is 20 rupees cheaper than petrol
  • పెట్రోల్ కంటే రూ.20 తక్కువ ధరతో ఇ-85 ఇథనాల్ ఇంధనం ప్రారంభం
  • ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త ఇంధనం ప్రత్యేకం
  • ముడి చమురు దిగుమతులు తగ్గించి విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడమే లక్ష్యం
  • 2027 చివరి నాటికి 5,000 ఔట్‌లెట్లలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక
ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 'ఇ-85' ఇంధనాన్ని ప్రారంభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిటైల్ ఔట్‌లెట్‌లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ కొత్త ఇంధనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఇ-85 ఇంధనంలో 80-85 శాతం ఇథనాల్, 14-19 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌లతో కూడిన వాహనాల కోసం రూపొందించ‌డం జ‌రిగింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీని ధర లీటరుకు దాదాపు రూ.20 తక్కువగా ఉండటం వినియోగదారులకు పెద్ద ఊరట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 48 ఫ్యూయల్ స్టేషన్లలో ఇ-85ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దశలవారీగా ఈ సంఖ్యను పెంచనున్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి 500, 2027 డిసెంబర్ నాటికి 5,000 రిటైల్ ఔట్‌లెట్లలో ఇ-85ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. ఇంధన లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే మూడు అంశాలను భారత్ విజయవంతంగా సమన్వయం చేస్తోందన్నారు. 2014లో కేవలం 1.53 శాతంగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్‌ను, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే 20 శాతం లక్ష్యానికి చేర్చామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1.84 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, సుమారు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని వివరించారు. ఈ ప్రగతితో దేశ రైతులు 'అన్నదాతలు' అనే స్థాయి నుంచి 'ఊర్జదాతలు' (శక్తి ప్రదాతలు)గా మారుతున్నారని ఆయన ప్రశంసించారు.

ఇ-85 ఇంధనం కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమేనని, దీని వాడకంపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాడుతున్న ఇ-20 ఇంధనం వల్ల ఇప్పటివరకు ఒక్క ఇంజిన్ వైఫల్యం కూడా నమోదు కాలేదని గుర్తుచేశారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, ఇ-85 ఇంధనం వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు 61 శాతం వరకు తగ్గుతాయని అంచనా. ఈ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విధానంలో సహకరించాలని మంత్రి కోరారు. "ప్రతి లీటరు ఇథనాల్ దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనానికి ప్రత్యామ్నాయం. ప్రతి ఇ-85 చుక్కలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి ఉంది" అని పురి అన్నారు.
Go Back to Shorts
E85 Fuel
Hardeep Singh Puri
Ethanol Blending
Flex Fuel Vehicles
Indian Oil Corporation
Ministry of Petroleum and Natural Gas
Petrol Price Discount
Atmanirbhar Bharat
Carbon Emission Reduction
Urjadata Farmers

More Telugu News