టేకాఫ్‌కు ముందు ఊహించని ప్రమాదం.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బర్డ్ హిట్!

  • ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి
  • బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ఘటన
  • ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం
  • రెండు ఇంజన్ల తనిఖీ తర్వాత ముంబైకి ప్రయాణం
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో శుక్రవారం రాత్రి ఒక విమానానికి ప్రమాదం తప్పింది. ముంబై వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ తీసుకునే క్రమంలో రన్‌వేపై పక్షి ఢీకొట్టడంతో (Bird hit) పైలట్ అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని తిరిగి విమానాశ్రయ బే (Bay)కి తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు.

ఇండిగోకు చెందిన '6E 6283' ఎయిర్‌బస్ A321neo విమానం శుక్రవారం రాత్రి 7:05 గంటలకు బెంగళూరు నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికులతో బోర్డింగ్ ముగించుకుని రన్‌వేపై టేకాఫ్ కోసం వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక పక్షి విమానాన్ని బలంగా ఢీకొట్టింది. విమాన సిబ్బంది దీనిని గుర్తించి, ప్రమాద తీవ్రతను అంచనా వేస్తూ టేకాఫ్‌ను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా విమానాన్ని వెనక్కి రప్పించి, సాంకేతిక, ఇంజనీరింగ్ బృందాలకు అప్పగించారు.

తనిఖీల అనంతరం అనుమతి
ఈ ఘటన జరిగిన వెంటనే విమానంలోని ప్రయాణికులు కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, అధికారులు వారికి నచ్చజెప్పారు. ఏవియేషన్ రూల్స్ ప్రకారం ఇలాంటి సమయాల్లో విమానం రెక్కలు, విండ్‌షీల్డ్‌తో పాటు ముఖ్యంగా రెండు ఇంజన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ ఇంజనీర్లు గంటన్నర పాటు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి, ప్రయాణానికి ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించి 'ఎయిర్ వర్తీనెస్' సర్టిఫికెట్ ఇచ్చారు. దీనితో రాత్రి 8:46 గంటల ప్రాంతంలో ఈ విమానం ప్రయాణికులతో ముంబైకి బయలుదేరి వెళ్లింది.

నగర ప్రాంతాలు, పచ్చదనం ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్టుల పరిసరాల్లో ఇలాంటి 'బర్డ్ హిట్' ఘటనలు తరచూ జరుగుతుంటాయి. పైలట్లకు ఉండే ముందస్తు శిక్షణ, విమానాల పటిష్టమైన డిజైన్ల వల్ల చాలా వరకు ఇవి సురక్షితంగానే ముగుస్తుంటాయి. అయినప్పటికీ ప్రయాణికులకు గంటన్నర పైగా వేచి చూడాల్సి రావడంతో కొంత అసౌకర్యం ఎదురైంది. ఈ ఘటనపై విమానాశ్రయ వన్యప్రాణుల నిర్వహణ విభాగం తదుపరి నిఘా చర్యలు చేపట్టింది.

IndiGo
Bengaluru Airport
Bird Hit
Mumbai Flight
Kempegowda International Airport
Aviation Safety
Flight 6E 6283
Airbus A321neo
Takeoff Aborted
Bengaluru News

More Telugu News