'పెద్ది'కి ఊహించని షాక్.. రెండో రోజే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసిన‌ హై క్వాలిటీ ప్రింట్స్‌!

  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి పైర‌సీ షాక్‌
  • విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్‌తో సినిమా లీక్
  • పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
  • వసూళ్లపై పైరసీ ప్రభావం చూపుతుందని విశ్లేషకుల ఆందోళన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా పైరసీ బారినపడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

విజయం మధ్యలో పైరసీ దెబ్బ

ఒకవైపు బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు చిత్రబృందానికి పైరసీ రూపంలో ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలైన రెండో రోజే పలు పైరసీ వెబ్‌సైట్లలో హై క్వాలిటీ (హెచ్‌డీ) ప్రింట్ లీక్ అయింది. థియేటర్లలో విజువల్ వండర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా, ఇంత త్వరగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడం పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకేజీ సినిమా లాంగ్ రన్ వసూళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పైరసీ లింకులను వెంటనే తొలగించాలని, ఈ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరుతున్నారు. ఈ పైరసీ గండాన్ని దాటుకుని 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

తొలిరోజే వంద కోట్లకు పైగా వసూళ్లు!

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో ఇంతటి పవర్‌ఫుల్ హిట్ పడటంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, 'పెద్ది' తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రామ్ చరణ్ సోలో కెరీర్‌లో ఇదే ఆల్-టైమ్ రికార్డు కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని, మేకర్స్ 'బాక్సాఫీస్ ఛాంపియన్' అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన ఈ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

Peddi
Ram Charan
Buchi Babu Sana
Peddi Box Office Collection
Peddi Movie Piracy
Peddi HD Print Leak
Mythri Movie Makers
Telugu Cinema News
Peddi Day 1 Gross
Peddi Online Watch

More Telugu News