ఆంధ్రా రొయ్య.. ప్రపంచస్థాయికి వెళ్లాలి: విశాఖ ఆక్వా సదస్సులో చంద్రబాబు

Chandrababu Naidu says Andhra Shrimp must stand on the global stage at Visakha Aqua Conference
  • బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడి
  • అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధికి ప్రణాళిక
  • భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో ఏపీ వాటా 38 శాతం అని వెల్లడి
  • ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ
  • 'ఆంధ్రా ష్రింప్.. ఇండియా సీ-ఫుడ్' అనే బ్రాండ్ స్థాపించాలని పిలుపు
భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారతదేశ బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగ అభివృద్ధికి తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.

భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు గణాంకాలతో వివరించారు. "దేశ మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం మనదే. దేశ సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 38 శాతం, అంటే సుమారు రూ.28,000 కోట్లకు పైగా ఏపీ నుంచే సమకూరుతోంది. ప్రపంచ సీ-ఫుడ్ వ్యాపారంలో భారత్ వాటా కేవలం 5 శాతమే ఉంది. దీన్ని పెంచడానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే, దేశ ఎగుమతులు కూడా వృద్ధి చెందుతాయి" అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రంగం సమగ్రాభివృద్ధికి ఒక బృహత్ ప్రణాళికను చంద్రబాబు ప్రకటించారు. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఒక 'ఆక్వా కారిడార్' అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 

"ఈ కారిడార్‌లో పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఒక సమగ్ర ఎకో సిస్టం ఏర్పాటు చేస్తాం. అతి తక్కువ వ్యయంతో అత్యధిక ఉత్పత్తి సాధించడమే మా లక్ష్యం. 'పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్' అనే విధానంతో ముందుకు సాగుతాం" అని తెలిపారు. 'ఆంధ్రా రొయ్య... ఇండియా సీ-ఫుడ్' అనే బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు 15 రోజుల్లోగా అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. "21వ శతాబ్దం నరేంద్ర మోదీదే. సరైన సమయంలో దేశానికి దొరికిన సరైన నేత ఆయన. భవిష్యత్తులో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రధాని మోదీ అద్భుతంగా కృషి చేస్తున్నారు. ఆయనను మరింత బలపర్చాల్సిన అవసరం ఉంది" అని చంద్రబాబు అన్నారు. 

ఈ సమావేశానికి తాను సైకిల్‌పై వచ్చానని, సైక్లింగ్ ద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని సూచించారు. ఆక్వా ఉత్పత్తుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని, ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh Aqua Sector
Blue Economy India
Visakhapatnam Seafood Workshop
Andhra Shrimp Branding
Aqua Corridor AP
Sea Food Exports
Pond to Port Policy
Kakinada Port Modernization
Viksit Bharat

More Telugu News