Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ

Raviteja starring Irumudi first glimpse out now
Advertisement
  • రవితేజ, శివ నిర్వాణ కాంబోలో 'ఇరుముడి'
  • విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో
  • అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్న మాస్ మహారాజా
  • తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో బలమైన కథ
  • ఆగస్టు 2026లో సినిమా విడుదల
Advertisement
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం 'ఇరుముడి' నుంచి మేకర్స్ బుధవారం ఓ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

విడుదలైన గ్లింప్స్‌లో రవితేజ పాత్రలోని వివిధ కోణాలను చూపించారు. కూతురిని ప్రేమగా చూసుకునే తండ్రిగా, ఆ తర్వాత కొన్ని విషాదకర పరిణామాల వల్ల హింసాత్మకంగా, మద్యానికి బానిసగా మారిన వ్యక్తిగా కనిపించారు. చివరకు కూతురి కోరిక మేరకు మద్యం మానేయడానికి అయ్యప్ప మాల ధరించి, తన జీవితాన్ని తిరిగి అదుపులోకి తెచ్చుకునే పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది.

"స్వామియే శరణం అయ్యప్ప.. మీకు 'ఇరుముడి' హృదయాన్ని అందిస్తున్నా. ఆగస్టు 2026లో థియేటర్లలో కలుద్దాం" అంటూ రవితేజ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే 'ఇరుముడి' అనే పేరును ఈ సినిమాకు పెట్టడం విశేషం. రవితేజకు ఇది 77వ చిత్రం.

భక్తి, భావోద్వేగాలు, మాస్ అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు శివ నిర్వాణ ఒక శక్తివంతమైన కథను రూపొందించారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తండ్రీకూతుళ్ల అనుబంధం ఈ కథకు గుండెలా నిలుస్తుందని, రవితేజ కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర అవుతుందని అంటున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Advertisement
Advertisement
Irumudi
Raviteja
First Glimpse
Shiva Nirvana
Priya Bhavani Shankar
Mythri Movie Makers

More Telugu News