‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!

Attack On Khan Sir Coaching Centre
  • మంగళవారం అర్ధరాత్రి ఘటన
  • సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి
  • ఆఫీస్ ఆస్తులు ధ్వంసం
  • కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు
  • ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్‌ సర్‌ అనుమానాలు
దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ అధ్యాపకుడు ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌పై మంగళవారం రాత్రి కొందరు దుండగులు దాడికి తెగబడ్డారు. పట్నాలోని సంస్థలోకి అక్రమంగా చొరబడిన కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న గార్డుపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. విపరీతంగా గొడవ చేస్తూ లోపల ఉన్న వస్తువులను, ఆస్తులను ధ్వంసం చేశారు. గాయపడిన సెక్యూరిటీ గార్డు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాల్పులు జరగలేదు
దాడి జరిగిన విషయం తెలియగానే ఖాన్ సర్ రాత్రి 11:30 గంటల సమయంలో కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు లోపలికి వచ్చి గార్డును కొట్టారని, ఆఫీస్ వస్తువులు ధ్వంసం చేశారని చెప్పారు. మొదట అక్కడ కాల్పులు జరిగాయని ప్రచారం జరిగినప్పటికీ పోలీసులు దాన్ని ఖండించారు. కేవలం తోపులాట, వస్తువుల ధ్వంసం మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు.

2 రోజుల ముందే బెదిరింపులు
ఇటీవల బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఖాన్ సర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వేలాది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారందరికీ కంపెనీ తరపున ఒక పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు వచ్చి రెండు రోజుల్లో కోచింగ్ సెంటర్‌ను బాంబులతో పేల్చేస్తామని బెదిరించినట్లు ఖాన్ సర్ ఆరోపించారు. ఆ బెదిరింపులు వచ్చిన రెండు రోజులకే ఈ దాడి జరిగింది.

తక్కువ ఫీజుల వల్లే కక్ష
ఈ ఘోరానికి తోటి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే కారణం కావచ్చునని ఖాన్ సర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. అది నచ్చని వారే ఈ పని చేయించి ఉంటారని అన్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలో కొందరు విద్యార్థులు పోస్టర్లు చించేస్తూ గొడవకు దిగినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులు
ఈ దాడికి నిరసనగా బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో విద్యార్థులు కోచింగ్ సెంటర్ బయట గుమిగూడి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను భారీగా పెంచారు. గాయపడిన గార్డు కూడా కొందరు నిందితులను గుర్తించానని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
Go Back to Shorts
Khan Sir
Coaching Centre
Patna
Bihar

More Telugu News