భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం

  • పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఆర్బీఐ బంగారం అమ్మిందన్న బ్లూమ్‌బర్గ్ 
  • రెండు వారాల్లో 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం విక్రయించినట్లు అంచనా
  • రూపాయిని స్థిరీకరించేందుకు, విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకే ఈ చర్య
  • చమురు ధరల పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం 
  • విదేశాల్లోని బంగారాన్ని భద్రతా కారణాలతో దేశానికి తరలిస్తున్న ఆర్బీఐ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, రూపాయిని స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న బంగారం నిల్వలను పాక్షికంగా విక్రయించి, కీలకమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలను (ఫారెక్స్) కాపాడుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ తన విశ్లేషణలో వెల్లడించింది. ఇది భారత కేంద్ర బ్యాంకు అనుసరిస్తున్న వ్యూహాత్మక మార్పును సూచిస్తోంది.

బ్లూమ్‌బెర్గ్ సీనియర్ ఇండియా ఎకనమిస్ట్ అభిషేక్ గుప్తా నివేదిక ప్రకారం మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో ఆర్బీఐ సుమారు 12 బిలియన్ డాలర్ల (రూ. 1.14ల‌క్ష‌ల కోట్లు) విలువైన బంగారాన్ని విక్రయించింది. అదే సమయంలో 7.5 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ ఆస్తులను కొనుగోలు చేసింది. ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ, ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ తగ్గడం ఈ అమ్మకాలకు సంకేతమని నివేదిక పేర్కొంది.

పశ్చిమాసియాలో యుద్ధం, హర్మూజ్ జలసంధి మూసివేత వంటి కారణాలతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర భారం పడుతోంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, కరెంట్ ఖాతా లోటు పెరగడంతో రూపాయి విలువ పతనమవుతోంది. మే 20న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.17 వద్ద ఆల్-టైమ్ కనిష్ఠ‌ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో రూపాయిని స్థిరీకరించేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వడ్డీ రేట్ల పెంపు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి డాలర్ల సమీకరణ వంటి అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు.

మరోవైపు ఆర్బీఐ తన బంగారం నిల్వల విషయంలోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పశ్చిమ దేశాలు రష్యా ఆస్తులను స్తంభింపజేసిన తర్వాత, విదేశాల్లోని తమ నిల్వల భద్రతపై ఆందోళన చెందుతున్న ఆర్బీఐ, బంగారాన్ని స్వదేశానికి తరలిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉండగా, అందులో 77% నిల్వలను దేశీయంగానే భద్రపరిచింది. ఆరు నెలల క్రితం ఇది కేవలం 66% మాత్రమే. డాలర్ బలహీనపడినప్పుడు, విదేశీ పెట్టుబడులు పెరిగినప్పుడు, లేదా చమురు ధరలు తగ్గినప్పుడు ఆర్బీఐ మళ్లీ విదేశీ మారక నిల్వలను పెంచుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Reserve Bank
RBI
Gold
Forex reserves
Bloomberg

More Telugu News