పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
- పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్
- రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ సభ పెట్టడంపై ఆగ్రహం
- ఆవిర్భావ దినోత్సవాన పవన్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ పొన్నం తీవ్ర విమర్శలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 'నవ నిర్మాణ సంకల్ప సభ' నిర్వహించాలని పవన్ కల్యాణ్ మొదట భావించారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేనాని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ పరిణామాలపై హుస్నాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారు. అలాంటి వ్యక్తి, తెలంగాణకు ఎంతో భావోద్వేగమైన ఆవిర్భావ దినోత్సవాన సభ ఎలా పెడతారు?" అని ప్రశ్నించారు. పవన్‌ను 'పెయిడ్ ఆర్టిస్ట్'గా అభివర్ణించిన పొన్నం, ఆయన పర్యటన వెనుక బీజేపీ వంటి ఇతర పార్టీల అజెండా ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు.
నాలుగు నెలల క్రితం పవన్ తెలంగాణకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి స్వాగతించిందని గుర్తుచేశారు. ఆయన రాష్ట్రానికి రావడాన్ని ఎవరూ అడ్డుకోరని, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌కు సంబంధించిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ పవన్ క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఏపీ ప్రజలను తెలంగాణ స్వాగతిస్తుందని మంత్రి అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, తెలంగాణలో తిరగవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలకు ఏం పని అని తాము అనడం లేదని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినే చర్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి చిట్టీలు వస్తున్నాయా అని నిలదీశారు.