కరెంట్ పోయినా వైఫై ఆగదు.. పోర్ట్రానిక్స్ నుంచి మినీ యూపీఎస్
- రూటర్లకు నిరంతర విద్యుత్ అందేలా పవర్ బ్యాంక్
- 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
- 5 గంటల వరకు పవర్ బ్యాకప్
- టైప్-సి, యూఎస్‌బీ పోర్టుల కనెక్టివిటీ
- ఆరంభ ఆఫర్ కింద రూ.1,699కే లభ్యం
ఆకర్షణీయమైన డిజైన్
ఈ సరికొత్త కైనెటిక్స్ 8K పరికరం డిజైన్ చాలా సింపుల్‌గా, ఆధునికంగా ఉంటుంది. పరిమాణంలో చాలా చిన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల రూటర్లు, కంప్యూటర్ టేబుల్ పక్కన చాలా తక్కువ స్థలంలోనే అమర్చుకోవచ్చు. దీనివల్ల వైర్లు ఎక్కువగా కనిపించకుండా గది క్లీన్‌గా ఉంటుంది. ఎక్కువ సమయం వాడినా పరికరం వేడెక్కకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైన వెంటిలేషన్ సపోర్ట్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
గంటల తరబడి బ్యాకప్
కైనెటిక్స్ 8K పరికరంలో 8,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. కరెంట్ పోయినప్పుడు ఇది సుమారు 5 గంటల వరకు నిరంతర బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే మనం కనెక్ట్ చేసే పరికరం, బ్యాటరీ కండిషన్, వాడే పవర్ ఆధారంగా ఈ సమయం మారవచ్చు. ముఖ్యంగా 12V డీసీ వైఫై రూటర్ల కోసం ఈ డిటెక్టర్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.
కనెక్టివిటీ ఆప్షన్లు
ఈ మినీ యూపీఎస్‌లో వేర్వేరు పరికరాల కోసం పలు రకాల ఔట్‌పుట్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 5V/2.1A, 9V/2A, 12V/1.5A డీసీ ఔట్‌పుట్‌లతో పాటు యూఎస్‌బీ-ఏ, టైప్-సి పోర్టులు కూడా ఉన్నాయి. ఈ విభిన్నమైన కనెక్టివిటీ వల్ల బ్రాడ్‌బ్యాండ్ డివైజ్‌లు, ఓఎన్‌టీ లేదా ఫైబర్ డివైజ్‌లు, సీసీటీవీ కెమెరాలకు కూడా దీని నుంచి పవర్ ఇచ్చుకోవచ్చు.
సులువైన వాడకం
దీన్ని ఇన్‌స్టాల్ చేయడం కోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. కేవలం వైర్లను రూటర్‌కు ప్లగ్ చేస్తే చాలు. వెంటనే పనిచేయడం మొదలవుతుంది. కరెంట్ పోయిన మరుక్షణమే ఇంటర్నెట్ ఆగిపోకుండా ఇది లైన్‌ను ఆన్‌లోనే ఉంచుతుంది. దీని అసలు ధర రూ.2,999 కాగా ప్రారంభ ఆఫర్ కింద పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1,699 ప్రత్యేక ధరకే లభిస్తోంది. దీనికి 12 నెలల వారంటీ కూడా ఇస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్ షాపుల్లోనూ ఇది అందుబాటులో ఉంది.