పవన్ కల్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- నటుడిగా పవన్ ను ఇష్టపడతామన్న మహేష్ గౌడ్
- రాజకీయపరంగా వ్యతిరేకిస్తామని వెల్లడి
- పవన్ ను తెర వెనుక నుండి ఎవరో వ్యక్తులు నడిపిస్తున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న వ్యక్తిగత అభిమానానికి, రాజకీయాలకు మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌ను ఒక నటుడిగా తామంతా ఇష్టపడతామని, అయితే రాజకీయ పరంగా మాత్రం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. "పవన్ కల్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడు. నటుడిగా ఆయనపై మాకు గౌరవం ఉంది, కానీ రాజకీయంగా మేము ఆయనతో విభేదిస్తాం" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయనను తెరవెనుక నుంచి ఎవరో వేరే వ్యక్తులు నడిపిస్తున్నారని ఆరోపించారు.