ఏఐతో నటి పరువు తీసే యత్నం.. 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు

  • నటి రుక్మిణి వసంత్ ఫేక్ వీడియోల వ్యాప్తిపై పోలీసులకు ఫిర్యాదు
  • మొత్తం 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు
  • ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన పరువుకు భంగం కలిగించారని నటి ఆవేదన
  • ఈ కేసులో ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద విచారణ
'కాంతార చాప్టర్-2' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ నకిలీ వీడియోల వ్యవహారంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆమె ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న 29 ఖాతాలపై నేడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు నటి రుక్మిణి వసంత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వేరొకరి శరీరానికి తన ముఖాన్ని అతికించి, ఫేక్ విజువల్స్ సృష్టించారని రుక్మిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య తనను తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని, ఉద్దేశపూర్వకంగా తన క్యారెక్టర్, ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేందుకే ఇలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, 9 ఇన్‌స్టాగ్రామ్, 14 'ఎక్స్', 6 ఫేస్‌బుక్ పేజీలతో సహా మొత్తం 29 ఖాతాలను గుర్తించి కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సెక్షన్లు 66సి, 66డితో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై గతంలోనే రుక్మిణి స్పందించారు. ఆన్లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న చిత్రాలు పూర్తిగా ఫేక్ అని, వాటిని ఏఐ టెక్నాలజీతో సృష్టించారని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పష్టం చేశారు. "ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం, వ్యాప్తి చేయడం బాధ్యతారాహిత్యం. ఇది వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే" అని ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీని మంచి పనులకు వాడాలని, ఇలాంటి హానికరమైన కార్యకలాపాలకు కాదని ఆమె హితవు పలికారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశారు.

రుక్మిణి వసంత్.. 2007లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన అశోక చక్ర గ్రహీత, దివంగత కల్నల్ వసంత్ వేణుగోపాల్ కుమార్తె. ఆయన స్ఫూర్తిగానే 'యూరి' అనే బాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది. రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ప్రముఖ భరతనాట్య కళాకారిణి.

Rukmini Vasanth
Fake bikini photos
social media accounts
FIR

More Telugu News