సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం
- ఓఎస్ఎం కాంట్రాక్టుపై సీబీఎస్ఈ నుంచి నివేదిక కోరిన కేంద్రం
- హైదరాబాద్ సంస్థకు కాంట్రాక్టు కేటాయింపుపై రేగిన వివాదం
- 12వ తరగతి మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థుల ఆందోళన
- టెండర్ నిబంధనలు మార్చారంటూ ఆరోపణలు
- అవకతవకలు తేలితే చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక
12వ తరగతి బోర్డు పరీక్షల డిజిటల్ మూల్యాంకనంలో సాంకేతిక లోపాలు తలెత్తిన విషయం తెలిసిందే. స్కాన్ చేసిన సమాధాన పత్రాలు సరిగా కనిపించకపోవడం, కొన్ని పేజీలు గల్లంతవడం, ఒక విద్యార్థికి బదులు మరొకరి సమాధాన పత్రాలు రావడం వంటి సమస్యలతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ, నిర్ణయాలు తీసుకున్న విధానం, ఇందులో పాలుపంచుకున్న అధికారులు, మార్గదర్శకాల అమలు వంటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరింది.
2026 విద్యా సంవత్సరానికి గాను సీబీఎస్ఈ తొలిసారిగా ఓఎస్ఎం విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసింది. ఇందుకోసం 2025 డిసెంబర్లో కోయెంప్ట్ ఎడ్యుటెక్‌కు కాంట్రాక్టు అప్పగించింది. అయితే, ఫలితాల తర్వాత సమస్యలు వెల్లువెత్తడంతో పలు కేసుల్లో మాన్యువల్‌గా రీ-వాల్యుయేషన్ చేయాల్సి వచ్చింది. టీసీఎస్ వంటి సంస్థలను కాదని, కోయెంప్ట్ సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలు మార్చారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
మరోవైపు, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, సాంకేతికంగా అర్హత సాధించిన సంస్థల్లో తక్కువ ధరకు కోట్ చేసినందుకే కోయెంప్ట్ కు కాంట్రాక్టు ఇచ్చామని సీబీఎస్ఈ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవడంతో విచారణ వేగవంతమైంది.