కార్పొరేట్ ఉద్యోగం కాదని.. క్యాబ్ బిజినెస్: నెలకు రూ.2 లక్షల సంపాదన
- రూ.30 వేల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదులుకున్న ముంబై యువకుడు
- ఒక్క వాహనంతో క్యాబ్ బిజినెస్ ప్రారంభం
- ప్రస్తుతం నాలుగు వాహనాలతో నెట్‌వర్క్
- మరికొంత మందికి డ్రైవింగ్ ఉపాధి
- రిస్క్ తీసుకుంటేనే విజయమని పిలుపు
కార్పొరేట్ కొలువుకు గుడ్ బై
ముంబైకి చెందిన ఈ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత క్యాబ్ బిజినెస్ వైపు అడుగులు వేశాడు. చదువు పూర్తయ్యాక నెలకు సుమారు రూ.30 వేల జీతంతో కార్పొరేట్ ఉద్యోగం వచ్చినా అతను తిరస్కరించాడు. ప్రారంభంలో లభించే ఆ తక్కువ జీతం తన సుదీర్ఘ ఆర్థిక లక్ష్యాలకు సరిపోదని బలంగా నమ్మాడు. సంప్రదాయ ఆఫీసు ఉద్యోగాల కోసం వెతకడం మానేసి ఒక కమర్షియల్ వాహనంతో రవాణా రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
ఒక్క వాహనం నుంచి నాలుగు కార్లు
ఒక్క కారుతో మొదలైన ఇతని వ్యాపారం కష్టపడే తత్వంతో క్రమంగా విస్తరించింది. ఇప్పుడు అతని దగ్గర నాలుగు కమర్షియల్ కార్ల నెట్‌వర్క్ ఏర్పడింది. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా నెలకు దాదాపు రూ.రెండు లక్షల ఆదాయం వస్తోందని అతను వెల్లడించాడు. ఒకవేళ తను సాఫ్ట్‌వేర్ రంగంలోనే కెరీర్ ప్రారంభించి ఉంటే ఈ స్థాయి సంపాదన వచ్చేది కాదని సంతోషంగా చెబుతున్నాడు.
రిస్క్ తీసుకుంటేనే విజయం
స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకొని కొత్త రంగంలోకి రావడం వెనుక ఎన్నో సవాళ్లు, అనిశ్చితులు ఉంటాయని ఈ యువకుడు అంగీకరించాడు. అయితే ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యాపారం చేయాలనుకునే వారికి జీవితంలో ఇలాంటి రిస్క్‌లు తప్పవని స్పష్టం చేశాడు. కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వారు ఎప్పుడూ ఆశలు వదులుకోవద్దని ధైర్యం చెప్పాడు. పట్టుదల, వినూత్న అవకాశాలను అన్వేషించే గుణం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని యువతకు పిలుపునిచ్చాడు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
ఈ ఇంజనీర్ విజయగాథపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతంగా వ్యాపారం చేయాలనే అతని ఆలోచనా విధానం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడుతున్నారు. ముఖ్యంగా వీడియో చివర్లో ‘‘సొంత బ్రాండ్‌ను నిర్మించుకోండి’’ అని అతను చెప్పిన మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సొంతంగా లాభాలు గడించడమే కాకుండా మరికొంత మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించడం విశేషం. సంప్రదాయ ఉద్యోగాల కంటే వ్యాపారాల వైపు మళ్లుతున్న నేటి యువత ఆలోచనా ధోరణికి ఈ కథే నిదర్శనం.