ఆర్సీబీ విక్టరీపై ఆసక్తికరంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

Royal Challengers Bangalore Victory Election Commission Response
  • ఐపీఎల్ 2026 ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జట్టు
  • ఆర్సీబీకి అభినందనలు తెలుపుతూ ఈసీ పోస్ట్
  • గెలుపును ఓటు చైతన్యానికి వినియోగించుకున్న ఎన్నికల సంఘం
  • 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు
  • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. కొందరి ప్రశంసలు, కొందరి విమర్శలు
ఐపీఎల్ 2026 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కైవసం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరంగా స్పందించింది. ఆర్సీబీ విజయాన్ని ఓటర్ల చైతన్యానికి వినూత్నంగా వినియోగించుకుంది. ఈ మేరకు ఈసీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక ప్రత్యేక పోస్ట్ చేసింది.

"ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీకి అభినందనలు. ఛాంపియన్లు తమ సమయం కోసం సిద్ధంగా ఉంటారు. మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 18 ఏళ్లు నిండుతున్నాయా? అయితే ఫారం 6 నింపి, ఛాంపియన్‌లా మీ ప్రజాస్వామ్య విధిని నెరవేర్చడానికి సిద్ధంకండి. మీ ఓటు విలువైంది" అని ఈసీ తన పోస్టులో పేర్కొంది. విరాట్ కోహ్లీ సహా ఆర్సీబీ ఆటగాళ్లు ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న చిత్రాన్ని కూడా దీనికి జత చేసింది.

యువతను ఓటు నమోదు దిశగా ప్రోత్సహించేందుకు ఈసీ చేపట్టిన 'సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్' (SVEEP) కార్యక్రమంలో భాగంగా ఈ పోస్ట్ చేశారు. క్రీడలు, పండుగలు, సినిమాలను ఉపయోగించి యువతకు చేరువవ్వడం ఈసీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగం.

అయితే, ఈసీ పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈసీ సృజనాత్మకతను మెచ్చుకుంటూ, యువతను ఆకట్టుకోవడానికి ఇది మంచి మార్గమని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం, ఎన్నికల నిర్వహణ వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి క్రీడా వినోదాలపై స్పందించడం సరికాదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


Go Back to Shorts
Royal Challengers Bangalore
RCB
IPL 2026
Election Commission of India
Voter Registration
Virat Kohli
SVEEP
Systematic Voters Education and Electoral Participation
India Elections
Form 6

More Telugu News