డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు

  • ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగానే వైసీపీ డీఎస్సీపై కక్ష కట్టిందన్న రవినాయుడు
  • పారదర్శక డీఎస్సీపై ఆరోపణలతో యువత జీవితాలతో ఆడుకోవద్దని హితవు
  • స్పోర్ట్స్ కోటా భర్తీపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్
  • డ్రైవర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించిన వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టీకరణ
గత ఎన్నికల్లో తమను ఓడించారన్న అక్కసుతోనే నిరుద్యోగ యువతపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై రాజకీయ దురుద్దేశంతో వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో "నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు" పేరిట నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వెయ్యి మందికి పైగా టీచర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో డీఎస్సీలో ఎంపికైన టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, కష్టపడి ఉద్యోగాలు సాధించిన పేద కుటుంబాల యువత కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

"రాజకీయంగా మాతో తలపడాలి కానీ, యువత జీవితాలతో ఆడుకోవడం తగదు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని జగన్, ఎన్నికలకు రెండు నెలల ముందు అసమగ్ర డీఎస్సీ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 150 రోజుల్లో 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దీన్ని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి 150 కేసులు వేశారు" అని రవినాయుడు గుర్తుచేశారు.

స్పోర్ట్స్ కోటాపై విచారణకు సిద్ధం
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలను రవినాయుడు తీవ్రంగా ఖండించారు. క్రీడాకారులకు సర్టిఫికేట్లు ఇచ్చేది అసోసియేషన్లు, ఫెడరేషన్లేనని, వాటిని ధృవీకరించుకున్నాకే 427 పోస్టులు భర్తీ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తే దానిపై నిందలు వేయడం దారుణమన్నారు. తమ హయాంలో, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

యువత ఏకమై జగన్‌ను తరిమికొట్టాలి: ఎమ్మెల్సీ శ్రీకాంత్
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. లక్షలాది మంది యువత ఆశలపై విషం చిమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి నరరూప రాక్షసుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువత కష్టపడి సాధించిన ఉద్యోగాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏకమై జగన్‌ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

డ్రైవర్లతో పేపర్లు దిద్దించిన చరిత్ర మీది: ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి
మరో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వైసిపి నేతలు యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్లను మంగళగిరి వద్ద హాయ్ ల్యాండ్‌లో డ్రైవర్లు, పనివాళ్లతో దిద్దించారని సంచలన ఆరోపణలు చేశారు. "అటువంటి చరిత్ర ఉన్న వైసీపీకి, పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసే నైతిక అర్హత ఉందా?" అని ఆయన నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితాను పబ్లిక్ డొమైన్‌లో పెట్టామని, తప్పు జరిగిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతామని స్పష్టం చేశారు.

Ravinaidu
SAP Chairman
DSC AP
AP DSC
Sports Authority Andhra Pradesh
Andhra Pradesh Teachers
TDP Government
YS Jagan Mohan Reddy
AP Politics
Teacher Recruitment

More Telugu News